మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల: కోడ్ అమల్లోకి, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మాత్రమే కోడ్ అమల్లో ఉంటుందని, మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఉండదని క్లారిటీ ఇచ్చారు. కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో కొత్త ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అధికారిక పర్యటనలు, సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు వీలు ఉండదని ఎన్నికల కమిషన్ తెలిపింది.

ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, కనీసం 85 శాతం పోలింగ్ నమోదయ్యేలా ముందుకు రావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని పిలుపునిచ్చారు. ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించడంలో రాజకీయ పార్టీల సహకారం ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే రాష్ట్ర స్థాయి మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి పార్టీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశాల్లో సూచనలు, సలహాలు, ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు సమాచారం. సర్వేల్లో ముందువరుసలో నిలిచిన అభ్యర్థులకు టికెట్లు కేటాయించాలనే నిర్ణయానికి పార్టీ నాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై వివాదాలు తలెత్తితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

విదేశీ పర్యటన ముగించుకుని ఫిబ్రవరి 1న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు రానున్నారు. అనంతరం ఫిబ్రవరి 2న గాదిభవన్‌లో మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి పార్టీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యే అవకాశం ఉంది.

నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతుండగా, విత్‌డ్రా గడువు వరకు బీ-ఫారమ్‌లు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో లాబీయింగ్‌కు అవకాశం లేకుండా గెలిచే సామర్థ్యం ఉన్న వారికే టికెట్లు ఇవ్వాలనే దిశగా పార్టీ కసరత్తు చేసినట్లు సమాచారం. అయితే ఆశావాహుల మధ్య అసంతృప్తి, గందరగోళం తలెత్తే అవకాశముండటంతో, పార్టీ నాయకత్వం ఎలా సమన్వయం చేస్తుందో చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *