5000 కాదు.. 19,000 పోలీస్ ఉద్యోగాలే కావాలి: రేవంత్ సర్కార్‌కు నిరుద్యోగుల అల్టిమేటం”

హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత మరోసారి రోడ్డెక్కింది. ప్రభుత్వం ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న 5,000 పోలీస్ పోస్టుల నోటిఫికేషన్ తమకు సరిపోదని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం 19,000 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

వెంటనే నోటిఫికేషన్… వెంటనే న్యాయం… వెంటనే నిర్ణయం” అంటూ నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన చేపట్టిన అభ్యర్థులు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

నిరసనకారులు మాట్లాడుతూ, తమకు ఎమ్మెల్సీ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు, రాజకీయ ప్రయోజనాలు అవసరం లేదని, ఉద్యోగాలు మాత్రమే కావాలని స్పష్టం చేశారు. “మేము కష్టపడి పనిచేసినందుకే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నిరుద్యోగుల మద్దతు లేకుండా ఈ ప్రభుత్వం వచ్చేదా?” అని ప్రశ్నించారు.

గత వారం రోజులుగా ధరణాలు, రాస్తారోకోలు, వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య ప్రభుత్వానికి కనిపించడం లేదని, “ఇది ప్రజల ప్రభుత్వం కాదా? లేక గుడ్డి ప్రభుత్వమా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కేవలం 5 వేల పోలీస్ పోస్టులతో సరిపెట్టాలని చూస్తోందని అభ్యర్థులు విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19 వేల పోలీస్ పోస్టులన్నింటికీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే, పోలీస్ నియామకాలలో వయో పరిమితిని పెంచాలని కూడా కోరారు. కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయస్సును 36 సంవత్సరాలకు, ఎస్ఐ పోస్టులకు మరో మూడు సంవత్సరాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్, నియామకాల జాప్యం వంటి కారణాలతో అనేక మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.

“మా కల ఒక్కటే… పోలీస్ యూనిఫామ్ ధరించడం. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కాదు. మా బాధను వినిపిస్తున్నాం,” అంటూ నిరసనకారులు భావోద్వేగానికి గురయ్యారు.

గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నప్పటికీ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో అద్దె గదుల్లో జీవనం సాగిస్తున్న వేలాది మంది యువత తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

5,000 పోలీస్ పోస్టులు వద్దు… 19,000 పోస్టుల నోటిఫికేషన్ కావాలి. మా భవిష్యత్తుతో ఆటలాడొద్దు” అంటూ నిరుద్యోగులు తమ డిమాండ్లను మరోసారి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *