తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పుకు నాంది పలికిన ఫలితాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నిన్నటి మొత్తం మీడియా ఫోకస్ ఒకే వ్యక్తి మీద నిలిచింది. ఆ వ్యక్తి దళపతి విజయ్. తమిళ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అద్భుతమైన ప్రదర్శనతో తమిళ రాజకీయాలను పూర్తిగా కుదిపేసింది.
డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల మధ్య ఎన్నో సంవత్సరాలుగా తిరిగిన తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ప్రత్యామ్నాయం పుట్టిందని ప్రజలు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. గత ప్రభుత్వాలపై పెరిగిన వ్యతిరేకత, ప్రజల్లో మార్పు కోరిక, కొత్త నాయకత్వంపై నమ్మకం ఇవన్నీ కలిపి టీవీకే పార్టీకి భారీగా కలిసివచ్చాయి.
ఇప్పటివరకు తమిళనాడులో ప్రజలకు రెండు పార్టీలే ప్రధాన ఆప్షన్లుగా కనిపించేవి. కానీ ఈసారి టీవీకే ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదిగింది. అధికార డీఎంకేపై ఉన్న అసంతృప్తి, ప్రతిపక్ష అన్నా డీఎంకేపై కూడా ఉన్న నిరాశ — ఈ రెండు ఓటు బ్యాంకులు చివరకు విజయ్ వైపు మళ్లినట్టుగా ఫలితాలు స్పష్టం చేశాయి.
ఈ ఎన్నికల్లో ప్రజలు అభ్యర్థులను చూసి కాకుండా నేరుగా విజయ్‌ను చూసే ఓటు వేసిన పరిస్థితి కనిపించింది. అభ్యర్థులు ఎవరు? ఎంత డబ్బు పంచారు? అనే అంశాలను పక్కన పెట్టి “విజయ్ పార్టీ” అనే భావోద్వేగంతో ప్రజలు ఓటు వేసినట్టు స్పష్టమైంది.
టీవీకే విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి బూత్ స్థాయి ఫ్యాన్ బేస్. విజయ్ అభిమాన సంఘాలను నేరుగా ఎన్నికల యంత్రాంగంగా మార్చి బూత్ స్థాయి కార్యకర్తలుగా వినియోగించుకోవడం పార్టీకి భారీ బలం ఇచ్చింది. గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు ఫ్యాన్స్‌ను ఆర్గనైజ్ చేసి పార్టీ కోసం పని చేయించడం టీవీకేకు గొప్ప ప్లస్ అయింది.
చాలా చోట్ల సామాన్యులను అభ్యర్థులుగా నిలబెట్టి కూడా గెలిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. డ్రైవర్లు, అకౌంటెంట్లు, సాధారణ కార్యకర్తలు కూడా టీవీకే తరఫున పోటీ చేసి విజయం సాధించడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక మరో సంచలన అంశం ఏమిటంటే, సీఎం స్టాలిన్‌పై టీవీకే అభ్యర్థి బీఎస్ బాబు విజయం సాధించడం. ప్రచారంలో విజయ్ స్వయంగా వెళ్లకపోయినా, విజయ్ డూప్‌తో ప్రచారం నిర్వహించారనే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని చోట్ల హోలోగ్రాఫిక్ వీడియోల ద్వారా విజయ్ మాట్లాడుతున్నట్టుగా చూపించి ప్రచారం చేయడం కూడా టీవీకేకు ఉపయోగపడింది.
ఇది ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థాయిని చూపిస్తోంది. ప్రజలు కేవలం “మార్పు” కోరుకున్నారని, ఆ భావోద్వేగం మొత్తం విజయ్‌కు ఓట్ల రూపంలో మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తిరుపత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి శ్రీనివాస్ సేతుపతి కేవలం ఒక్క ఓటు తేడాతో గెలవడం ఇప్పుడు ఎన్నికలలో అత్యంత అరుదైన ఘటనగా మారింది. డీఎంకే అభ్యర్థిపై ఒక్క ఓటు ఆధిక్యంతో గెలవడం టీవీకే అదృష్టానికి ప్రతీకగా మారింది.
మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 స్థానాలు అవసరం. అయితే టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. డీఎంకే 73 స్థానాలకు పరిమితమవగా, అన్నా డీఎంకే 53 స్థానాలు గెలుచుకుంది.
ఇప్పుడు అసలు రాజకీయ ఉత్కంఠ మొదలైంది. ముఖ్యమంత్రి పీఠం దక్కాలంటే విజయ్‌కు ఇంకా 10 నుంచి 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్ పార్టీతో పాటు పీఎంకే వంటి చిన్న పార్టీల మద్దతు కీలకంగా మారింది.
అయితే డీఎంకే లేదా అన్నా డీఎంకే టీవీకేకు మద్దతు ఇస్తాయా అనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలన్నీ విజయ్ చుట్టూనే తిరుగుతున్నాయి.
మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీగా టీవీకే సాధించిన ఈ విజయం ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా ప్రత్యేక చర్చకు దారి తీసింది. తమిళనాడులో ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయం వచ్చిందా అనే చర్చ కూడా మొదలైంది.
ఏదేమైనా, కేవలం ఏడాదిన్నరలోనే 108 స్థానాలు గెలిచి తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా మారిపోయారు.

