తమిళనాడులో టీవీకే ప్రభంజనం.. 108 సీట్లతో విజయ్ సంచలనం

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల మధ్యే తిరిగిన తమిళ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త శకం మొదలైనట్టుగా కనిపిస్తోంది. తమిళ వెట్రి కళగం (టీవీకే) పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ అద్భుతమైన ప్రభంజనం సృష్టించారు. కేవలం ఏడాదిన్నర కాలంలోనే టీవీకే పార్టీ తమిళనాడులో అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

నిన్నటి ఎన్నికల ఫలితాల అనంతరం మొత్తం మీడియా ఫోకస్ విజయ్‌పైనే నిలిచింది. అన్ని ఛానళ్లలో కూడా టీవీకే పార్టీ గురించే ప్రధాన చర్చ జరిగింది. డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఎదురుచూస్తున్న ఓటర్ల భావోద్వేగం మొత్తం టీవీకే వైపు మళ్లినట్టు స్పష్టంగా కనిపించింది.

ఇప్పటివరకు తమిళనాడులో డీఎంకే లేదా అన్నా డీఎంకే అనే రెండు ఆప్షన్లే ప్రజల ముందు ఉండేవి. కానీ ఈసారి టీవీకే పార్టీ ఒక కొత్త ప్రత్యామ్నాయంగా కనిపించింది. అదే విజయ్‌కు భారీ ప్లస్ అయింది. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతతో పాటు ప్రతిపక్షంపై ఉన్న అసంతృప్తి కూడా కలసి టీవీకేకు అనుకూల వాతావరణం సృష్టించాయి.

ఈ ఎన్నికల్లో ప్రజలు అభ్యర్థులను కాకుండా విజయ్‌ను చూసి ఓటు వేసినట్టు స్పష్టంగా కనిపించింది. చాలా చోట్ల అభ్యర్థులు ఎవరో కూడా ప్రజలకు పెద్దగా తెలియకపోయినా “విజయ్ పార్టీ” అనే ఒక్క కారణంతోనే ఓట్లు పడ్డాయి. డబ్బు పంపిణీ, కుల సమీకరణలు, స్థానిక రాజకీయాలు అన్నింటినీ దాటేసి “విజయ్” అనే ఇమేజ్ ఓటుగా మారింది.

ప్రత్యేకంగా టీవీకే పార్టీ బూత్ స్థాయిలో చేసిన వ్యూహం ఇప్పుడు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. విజయ్ ఫ్యాన్ బేస్‌ను నేరుగా బూత్ స్థాయి కార్యకర్తలుగా మార్చడం పార్టీకి భారీ బలం ఇచ్చింది. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అభిమాన సంఘాలను ఎన్నికల యంత్రాంగంగా మార్చి వినియోగించుకోవడం టీవీకే విజయానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

చాలా నియోజకవర్గాల్లో సాధారణ వ్యక్తులను అభ్యర్థులుగా నిలబెట్టి కూడా గెలిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డ్రైవర్లు, అకౌంటెంట్లు, సామాన్య కార్యకర్తలు కూడా టీవీకే తరఫున పోటీ చేసి గెలిచిన పరిస్థితులు కనిపించాయి.

ఇక మరో సంచలన విషయం ఏమిటంటే, సీఎం స్టాలిన్‌పై టీవీకే అభ్యర్థి బీఎస్ బాబు గెలవడం. ప్రచారంలో విజయ్ స్వయంగా వెళ్లకపోయినా, విజయ్ డూప్‌తో ప్రచారం నిర్వహించినట్టు వార్తలు వైరల్ అయ్యాయి. కొన్ని చోట్ల హోలోగ్రాఫిక్ వీడియోల ద్వారా విజయ్ మాట్లాడుతున్నట్టుగా ప్రచారం చేయడం కూడా టీవీకేకు ఉపయోగపడింది.

ఇది ప్రజల్లో ఎంతటి మార్పు కోరిక ఉందో చూపిస్తోంది. ప్రజలు కేవలం అధికార, ప్రతిపక్ష పార్టీలను మార్చాలని మాత్రమే నిర్ణయించుకున్నారని, ఆ భావోద్వేగం మొత్తం టీవీకేకు కలిసివచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక తిరుపత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి శ్రీనివాస్ సేతుపతి కేవలం ఒక్క ఓటు తేడాతో గెలవడం ఎన్నికలలో అత్యంత అరుదైన ఘటనగా మారింది. 88,375 ఓట్లలో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో డీఎంకే అభ్యర్థిపై విజయం సాధించడం ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశమైంది.

మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118. అయితే టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. డీఎంకే 73 స్థానాలకు పరిమితమవగా, అన్నా డీఎంకే 53 స్థానాలు గెలుచుకుంది.

ఇప్పుడు అసలు రాజకీయ ఉత్కంఠ మొదలైంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే విజయ్‌కు ఇంకా 10 నుంచి 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్ పార్టీ, పీఎంకే వంటి చిన్న పార్టీల మద్దతు కీలకంగా మారింది. ఇప్పటికే రాహుల్ గాంధీతో విజయ్ ఫోన్‌లో మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది.

ఒకవేళ కాంగ్రెస్ పార్టీ డీఎంకేను పక్కన పెట్టి టీవీకేకు మద్దతు ఇస్తే తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. లేదంటే మళ్లీ డీఎంకే లేదా అన్నా డీఎంకే మద్దతు కీలకం కానుంది.

ఏదేమైనా, తమిళనాడులో ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా టీవీకే ఎదగడం చారిత్రాత్మక పరిణామంగా మారింది. తొలి ఎన్నికలలోనే 108 స్థానాలు గెలుచుకోవడం ద్వారా విజయ్ తమిళ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *