కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీలో జరిగిన భారీ దోపిడి కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆదివారం జరిగిన ఈ దోపిడీ ఘటనలో నిందితులు అత్యంత పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా పోలీసులను తప్పుదారి పట్టించేందుకు “డైవర్ట్ అండ్ ఎస్కేప్” ప్లాన్ అమలు చేసిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పోలీసుల సమాచారం ప్రకారం, జ్యోతినగర్‌లోని పీఎంజే జ్యువెలరీ నుంచి బయటకు వచ్చిన దుండగులు మొదట ద్విచక్ర వాహనాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కార్యాలయం వైపు ప్రయాణించారు. అక్కడి నుంచి విద్యానగర్ మీదుగా మల్కాపూర్ వైపు వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో గుర్తించారు. మొదట ప్రధాన రహదారుల వైపు వెళ్లినట్టుగా కనిపించడంతో పోలీసులు నిజామాబాద్ లేదా మహారాష్ట్ర దిశగా పారిపోయి ఉంటారని భావించారు.
అయితే అనంతరం సీసీ కెమెరాల ఫుటేజీలను లోతుగా పరిశీలించగా అసలు ప్లాన్ బయటపడింది. మల్కాపూర్ చౌరస్తా నుంచి వెలిచల ఎక్స్ రోడ్ మీదుగా ఎస్ఆర్పీ కాలువ వెంట గ్రామీణ ప్రాంతాల గుండా వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. రామడుగు మండలం రుద్రారం, రంగసాయిపల్లి, లక్ష్మీపూర్ టన్నెల్ ప్రాంతాల గుండా వరద కాలువ మార్గం ఉపయోగించి గంగాధర మండలం కోట్ల నరసింహపూర్ వైపు వెళ్లినట్టు ఆధారాలు లభించాయి.
దుండగులు ప్రధాన రహదారులను పూర్తిగా తప్పించుకుని గ్రామీణ మార్గాలను ఎంచుకోవడం వెనుక స్పష్టమైన వ్యూహం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. పట్టణాల్లో సీసీ కెమెరాలు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ రికార్డు అయ్యే ప్రమాదం ఉందని భావించి, పొలాల మధ్య మార్గాలు ఉపయోగించినట్టు అంచనా వేస్తున్నారు.
మల్కాపూర్, గంగాధర మండలాల్లోని కొన్ని వ్యవసాయ భూముల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిందితుల కదలికలు రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులు ఆదివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు గంగాధర, రామడుగు మండలాల్లో కూంబింగ్ నిర్వహించారు. అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టినా ఎలాంటి ఆధారాలు లభించలేదు.
ఇప్పటికే దొంగలు జగిత్యాల జిల్లాలోకి ప్రవేశించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అక్కడి నుంచి మంచిర్యాల, బెల్లంపల్లి లేదా నిజామాబాద్ వైపు వెళ్లి రైలుమార్గం ద్వారా రాష్ట్రం దాటి ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ కేసులో మరో కీలక విషయం ఏమిటంటే, నిందితులు టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించినట్టు తెలుస్తోంది. గూగుల్ మ్యాప్స్, మొబైల్ లొకేషన్ ఆధారంగా ముందుగానే రూట్ ప్లాన్ చేసుకుని వచ్చి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల మీదుగా తప్పించుకునే మార్గాలను ముందుగానే సెల్‌ఫోన్‌లో సెట్ చేసుకుని అమలు చేసినట్టు అనుమానిస్తున్నారు.
దొంగలు స్థానికులు కాదని, బీహార్ లేదా మహారాష్ట్రకు చెందిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. సెల్‌ఫోన్ డేటా, బైక్ వివరాలు, ముఖ కదలికల ఆధారంగా బీహార్‌కు చెందిన గ్యాంగ్‌పై అనుమానం బలపడినట్టు సమాచారం. ఆ గ్యాంగ్‌లోని ఇద్దరు సభ్యులను ఇప్పటికే గుర్తించినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కరీంనగర్ నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లాయి. అక్కడి స్థానిక పోలీసులతో కలిసి నిందితుల ఫోటోలు చూపిస్తూ వారి కదలికలపై సమాచారం సేకరిస్తున్నారు. పాత నేరస్తుల డేటాబేస్‌తో సీసీ ఫుటేజీలను పోల్చి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇప్పటికే నిందితుల ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. పోలీసులు మాత్రం ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దోపిడి యాదృచ్ఛికంగా జరగలేదని, పూర్తిగా ప్రీ-ప్లాన్డ్ ఆపరేషన్ అని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించిన పోలీసులు, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

