కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా యూడిఎఫ్ విజయంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీం ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. కేరళలో కాంగ్రెస్ గెలుపుకు రేవంత్ రెడ్డి ప్రచారం కీలక పాత్ర పోషించిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను అక్కడ ప్రధాన అజెండాగా తీసుకెళ్లి ప్రచారం చేయడం, పినరయి విజయన్ ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేయడం, ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం పెంచిందని అభిప్రాయపడుతున్నారు.
కేరళ ప్రచారంలో రేవంత్ రెడ్డి తెలంగాణ మోడల్‌ను విస్తృతంగా ప్రస్తావించారు. మహిళలకు ఉచిత బస్సు, రైతు రుణమాఫీ, రైతు బంధు, ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు, లక్షల ఉద్యోగాలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఫ్యూచర్ సిటీ, హైటెక్ అభివృద్ధి వంటి అంశాలను ఉదాహరణలుగా చూపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజా సంక్షేమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని అక్కడి ప్రజలకు వివరించారు.
అయితే మరోవైపు ఈ ప్రచారంపై విమర్శలు కూడా వస్తున్నాయి. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలు కాలేదని, ఉద్యోగాలు, రైతు సమస్యలు, ఫించన్లు, మహిళా పథకాల్లో ఇంకా అసంతృప్తి ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేరళ ప్రజలకు తెలంగాణ వాస్తవ పరిస్థితులు పూర్తిగా తెలియకపోవడం వల్లే కాంగ్రెస్‌కు మద్దతు లభించిందని విమర్శకులు అంటున్నారు.
ఇక తమిళనాడులో టీవీకే పార్టీ విజయంతో మరో కొత్త చర్చ మొదలైంది. విజయ్ పార్టీ అద్భుత ఫలితాలు సాధించడంతో ప్రాంతీయ ప్రత్యామ్నాయ రాజకీయాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. డీఎంకే, అన్నాడీఎంకే వంటి సంప్రదాయ పార్టీలపై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతను విజయ్ సక్సెస్‌గా క్యాష్ చేసుకున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు. బూత్ స్థాయి ఫ్యాన్ బేస్‌ను రాజకీయ శక్తిగా మార్చి కొత్త రాజకీయ మోడల్‌ను విజయ్ చూపించాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇది తెలంగాణ రాజకీయాల్లో కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఒక కొత్త ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యువతలో ఈ భావన ఎక్కువగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
బీజేపీ నేత బండి సంజయ్ “తర్వాతి టార్గెట్ తెలంగాణ” అని ప్రకటిస్తుండగా, కాంగ్రెస్ మాత్రం కేరళ ఫలితాలతో మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా తిరిగి బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రజలు మాత్రం మాటల కంటే పనిని చూస్తున్నారనే చర్చ బలంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఒక స్పష్టమైన సందేశం కనిపిస్తోంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కానీ ఆ మార్పు ఎవరి రూపంలో వస్తుంది? కొత్త పార్టీ రూపంలోనా? లేక ప్రస్తుత పార్టీల్లోనే మార్పు వస్తుందా? అన్నది రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారబోతోంది.

