హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ కాసా గ్రాండ్ హోటల్ వేదికగా ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ (IKF) జనరల్ బాడీ సమావేశం జరుగుతోంది. కబడ్డీ క్రీడను దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశానికి కబడ్డీ ఫెడరేషన్‌కు సంబంధించిన ప్రముఖ ప్రతినిధులు, బోర్డు సభ్యులు కసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వెంకటేష్ బండారి, గోవింద్ నారాయణ్ శర్మ తదితరులు హాజరయ్యారు.
కబడ్డీకి ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో కసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఈ కార్యక్రమానికి చొరవ తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే కబడ్డీ దేశంలో ఎంతో ప్రజాదరణ పొందిన క్రీడగా కొనసాగుతుండగా.. అంతర్జాతీయ స్థాయిలోనూ దీనికి మరింత ఆదరణ తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇటీవలే వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులతో జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో.. ఇప్పుడు కబడ్డీని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించే దిశగా చర్యలు చేపడుతున్నారు.
ఈ సమావేశానికి సుమారు 35 నుంచి 42 దేశాలకు చెందిన ప్రతినిధులు హైదరాబాద్‌కు చేరుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కబడ్డీ అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో క్రీడకు మరింత ప్రాచుర్యం కల్పించడం, వివిధ దేశాల్లో కబడ్డీకి అవసరమైన మౌలిక వసతులను పెంచడం వంటి అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో కబడ్డీ ఫెడరేషన్‌కు సంబంధించి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల ఎన్నికలు కూడా జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీని మరింత బలోపేతం చేయడం, వివిధ దేశాల్లో క్రీడాకారులను ప్రోత్సహించడం, కబడ్డీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడం వంటి లక్ష్యాలతో ఈ సమావేశం కీలకంగా మారింది.
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ జనరల్ బాడీ మీటింగ్ ద్వారా కబడ్డీ భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఫెడరేషన్‌కు కొత్త నాయకత్వం ఎవరు చేపడతారు? అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.

