ఒలింపిక్సే కబడ్డీ తదుపరి లక్ష్యం.. ప్రపంచ దేశాల్లో కబడ్డీని విస్తరించాలి: బల్గేరియా కబడ్డీ ఫెడరేషన్ అధ్యక్షుడు డా. అమన్ సోహల్

హైదరాబాద్: కబడ్డీని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలు, శిక్షణ, భద్రతా నిబంధనలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని బల్గేరియా కబడ్డీ ఫెడరేషన్ అధ్యక్షుడు డా. అమన్ సోహల్ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ సమావేశానికి హాజరైన ఆయన.. భవిష్యత్ కబడ్డీ అభివృద్ధిపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

డా. అమన్ సోహల్ బల్గేరియాలోని ఇండియన్ అసోసియేషన్‌కు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. బల్గేరియాలో 10 వేల మందికి పైగా భారతీయులకు ఈ అసోసియేషన్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పారు. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసిన తాను స్పోర్ట్స్ సైన్స్, కబడ్డీ కోచింగ్‌లో ప్రత్యేకత కలిగి ఉన్నానని వివరించారు.

ఒలింపిక్సే మా కల

అంతర్జాతీయ కబడ్డీ అభివృద్ధిలో స్పష్టమైన నియమ నిబంధనలను పాటించడం అత్యంత కీలకమని డా. అమన్ సోహల్ అన్నారు. ఆసియా స్థాయిలో కబడ్డీ ఇప్పటికే సాధించిన పురోగతి తర్వాత కామన్వెల్త్, చివరకు ఒలింపిక్ స్థాయికి కబడ్డీని తీసుకెళ్లడం తమ లక్ష్యమని చెప్పారు.

ఒలింపిక్ స్థాయికి చేరుకోవాలంటే అంతర్జాతీయ ప్రమాణాలు, సంబంధిత ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రపంచ దేశాలకు కబడ్డీ సందేశం

కబడ్డీ భారతదేశానికి చెందిన క్రీడగా ప్రపంచంలోని అన్ని దేశాలకు పరిచయం చేయాల్సిన బాధ్యత ఉందని డా. అమన్ సోహల్ పేర్కొన్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, క్రీడా మంత్రిత్వ శాఖ, వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ద్వారా కబడ్డీని మరింతగా ప్రమోట్ చేయవచ్చని సూచించారు.

భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకు కబడ్డీని తీసుకెళ్లే విధంగా సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. భవిష్యత్‌లో “వరల్డ్ కబడ్డీ డే” వంటి కార్యక్రమాలను నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలించవచ్చని తెలిపారు.

అంతర్జాతీయ కోచ్‌లకు ప్రత్యేక శిక్షణ

కబడ్డీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలంటే నాణ్యమైన కోచ్‌లను తయారు చేయడం చాలా ముఖ్యమని డా. అమన్ సోహల్ అన్నారు. అంతర్జాతీయ కోచ్‌లకు ప్రత్యేక శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు.

అలాగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు అనుగుణంగా కొత్త నిబంధనలు, సురక్షితమైన ఆటతీరు, క్రీడాకారుల రక్షణ వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. క్రీడాకారులకు స్పోర్ట్స్ ఇన్సూరెన్స్ వంటి భద్రతా చర్యలపై కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

కబడ్డీ అంటే ఫిట్‌నెస్‌తో పాటు క్రమశిక్షణ

కబడ్డీ కేవలం ఆట మాత్రమే కాదని.. ఇది ఆటగాళ్లలో క్రమశిక్షణ, స్పోర్ట్స్‌మన్ స్పిరిట్‌ను పెంపొందించే క్రీడ అని డా. అమన్ సోహల్ తెలిపారు.

కబడ్డీ ద్వారా ఫ్లెక్సిబిలిటీ, ఎండ్యూరెన్స్, స్పీడ్, అజిలిటీ, పవర్ వంటి ఫిట్‌నెస్ అంశాలను అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. ఆటగాడి సంపూర్ణ శారీరక సామర్థ్యాన్ని పెంచడంలో కబడ్డీ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

యువత ఆరోగ్యంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది

యువతకు కబడ్డీ ఎంతో ఉపయోగకరమైన క్రీడ అని డా. అమన్ సోహల్ పేర్కొన్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక చురుకుదనం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి వంటి లక్షణాలను కబడ్డీ నేర్పుతుందని చెప్పారు.

“యువత ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది.. దేశం ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం మరింత మంచిగా ఉంటుంది” అనే సందేశాన్ని ఆయన ఇచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా కబడ్డీకి మరింత గుర్తింపు తీసుకురావడమే తమ విజన్ అని, అంతర్జాతీయ సహకారంతో క్రీడను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని డా. అమన్ సోహల్ ఆకాంక్షించారు.

“వన్ వరల్డ్.. వన్ లైఫ్.. వన్ కబడ్డీ” అంటూ ఆయన తన విజన్‌ను వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *