రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం జరగనున్న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల బందోబస్తు, వెబ్‌కాస్టింగ్ విధానం, భద్రతా చర్యలపై మంగళవారం డీజీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భారీగా అక్రమ నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, బంగారం-వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం రూ.1.29 కోట్ల నగదు, రూ.1.21 కోట్ల విలువైన మద్యం, రూ.15 లక్షల విలువైన మాదకద్రవ్యాలు, రూ.28.69 లక్షల విలువైన బంగారం-వెండి పట్టుబడినట్లు తెలిపారు.
అక్రమ రవాణాను అరికట్టేందుకు పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్‌పోస్టులు, జిల్లా సరిహద్దుల్లో 55 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన నిఘా ఉంచుతున్నట్లు అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద పగట్బందీ భద్రత కల్పించామని తెలిపారు.
మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 1302 కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగా, 1926 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించినట్లు ఏడీజీపీ మహేష్ భాగవత్ తెలిపారు. టీఎస్పీఎస్పీ, టీఎస్పీతో పాటు అటవీ, ఎక్సైజ్, సీఐడీ, లీగల్ మెట్రాలజీ విభాగాలకు చెందిన సుమారు 3000 మంది అదనపు బలగాలను రంగంలోకి దించారు.
రాష్ట్ర సరిహద్దుల్లో 181 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 167 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్‌లు పనిచేస్తున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా 1183 లైసెన్స్డ్ ఆయుధాలను డిపాజిట్ చేయించారు. 4318 మందిని బైండ్ ఓవర్ చేసి, 398 నాన్‌బెయిలబుల్ వారెంట్లను అమలు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 142 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని అధికారులు వెల్లడించారు.
మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డ్ బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
ఇదిలా ఉండగా ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు, బంగారం, ఇతర ప్రలోభాల పంపిణీ ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓటర్లను డబ్బుతో ప్రభావితం చేయాలనే ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని, స్వేచ్ఛగా, బాధ్యతతో ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

