తెలంగాణలో ఆర్టీసీ సమ్మె అధికారికంగా ప్రారంభమైంది. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే బస్సులు నిలిచిపోయాయి. డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా జేఏసీ నేతలు చర్యలు తీసుకుంటున్నారు.
సమ్మెకు ముందు ప్రభుత్వం చివరి ప్రయత్నంగా కమిటీ ద్వారా చర్చలు జరిపించినా అవి విఫలమయ్యాయి. సచివాలయంలో ఐఏఎస్ అధికారులు, ఆర్టీసీ ఎండీతో కలిసి ఏర్పాటు చేసిన కమిటీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జేఏసీ నేతలతో చర్చలు జరిపింది. అయితే సమస్యల పరిష్కారానికి నాలుగు వారాల గడువు ఇవ్వాలని కమిటీ కోరగా, దీనికి జేఏసీ నేతలు అంగీకరించలేదు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాలకు గుర్తింపు ఇవ్వడం వంటి కీలక అంశాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని జేఏసీ పట్టుబట్టింది. కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ, గత్యంతరం లేకే సమ్మెకు దిగుతున్నామని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు.
ఇక ప్రభుత్వం తరఫున ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సూచించారు. అయినప్పటికీ కార్మికులు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.
రోజుకు సుమారు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగిస్తుండగా, అందులో 35 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణ పథకాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమ్మె కారణంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలగనున్నాయి.
గతంలో కూడా పలుమార్లు ఆర్టీసీ కార్మికులు ధర్నాలు, నిరసనలు చేపట్టినా సమస్యలు పరిష్కారం కాలేదని సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రిటైర్డ్ మరియు ప్రస్తుత ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
చర్చలు విఫలమవడంతో సమ్మె అనివార్యమైందని, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.

