బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన వేళ ఆయన తాజాగా స్పందించారు. ప్రధాని ని కలిస్తే బీజేపీలో చేరినట్టేనా అంటూ ప్రశ్నిస్తూ తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
ఇటీవల మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరబోతుందనే ప్రచారం జోరుగా సాగింది. అంతేకాదు బీజేపీలో చేరేందుకు ఐదు సీట్లు కోరినట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ ప్రచారాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారనే వార్తలు వచ్చాయి.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రచారం ప్రకారం కేసీఆర్ స్వయంగా మల్లారెడ్డిని పిలిపించుకుని “ఉంటావా.. పోతావా?” అంటూ క్లారిటీ కోరినట్టుగా ప్రచారం జరిగింది. ప్రజాక్షేత్రంలో తిరగాలని, పార్టీకి నిబద్ధతగా ఉండాలని సూచించినట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది.
అయితే ఈ ప్రచారాలన్నింటినీ మల్లారెడ్డి ఖండించారు. “ప్రధానిని కలిస్తే బీజేపీలో చేరినట్టేనా? నేను ఎప్పుడైనా పార్టీ మారుతున్నానని చెప్పానా?” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, పార్టీ మారే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. బయట జరిగే ప్రచారాలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదన్నారు.
అయితే తెలంగాణ రాజకీయాల్లో గతంలో పార్టీ మారిన పలువురు ఎమ్మెల్యేలు కూడా మొదట ఇదే తరహాలో స్పందించిన విషయం ఇప్పుడు చర్చకు వస్తోంది. కాంగ్రెస్‌లో చేరినట్టు స్పష్టంగా కనిపిస్తున్న కొందరు నేతలు కూడా అధికారికంగా మాత్రం “మేమింకా బీఆర్ఎస్లోనే ఉన్నాం” అని చెబుతుండటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
ప్రత్యేకంగా దానం నాగేందర్ వంటి నేతలు కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటూ, కాంగ్రెస్ జెండాలతో కనిపిస్తున్నప్పటికీ తాము పార్టీ మారలేదని చెప్పడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు మల్లారెడ్డి వ్యాఖ్యలపై కూడా రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు బీఆర్ఎస్ నుంచి మరికొందరు నేతలు కూడా పార్టీ మారే అవకాశాలపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

