దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల పెంపు మరోసారి సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా 5 కిలోల చిన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.600–700 నుంచి ఒక్కసారిగా రూ.993కు చేరుకోవడం చిన్న వ్యాపారులు, గుడిసెల్లో నివసించే కుటుంబాలు, వాచ్మెన్ డ్యూటీలు చేసే కార్మికులు, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ కొరతపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తర్వాత ప్రభుత్వం “ఎలాంటి కొరత లేదు” అని ప్రకటించినా, ఇప్పుడు మళ్లీ గ్యాస్ ధరలు పెరగడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.
ప్రత్యేకంగా కమర్షియల్ గ్యాస్ ధరలు రూ.3000 దాటడంతో హోటళ్లు, టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లపై భారీ భారం పడనుంది. దీంతో టీ, టిఫిన్లు, భోజనాల ధరలు పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటివరకు రూ.10కు లభించిన టీ రూ.15కు, రూ.30–40 ఉన్న టిఫిన్ ప్లేట్లు రూ.50–100 వరకు వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
పెద్ద హోటళ్లకు ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ చిన్న చిన్న టిఫిన్ బండ్లు, గుడిసెల్లో జీవించే కుటుంబాలు, రోజువారీ కూలీలు మాత్రం ఈ భారాన్ని భరించలేరు” అని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికే తక్కువ జీతాలతో జీవనం సాగిస్తున్న వాచ్మెన్లు, కార్మికులు, మధ్యతరగతి కుటుంబాలు గ్యాస్, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నాయని వాపోతున్నారు.
కొంతమంది ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ “ఎన్నికల తర్వాతే ధరలు పెరుగుతున్నాయి” అని ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు ధరలు నియంత్రించి, తర్వాత పెంచడం సాధారణమైందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధాల ప్రభావం, దిగుమతి ఖర్చులు పెరగడం వల్లే ధరల పెంపు తప్పడం లేదని చెబుతోంది.
ఇదే సమయంలో రాజకీయాలపై కూడా ప్రజల్లో చర్చ సాగుతోంది. కొత్తగా పార్టీ ప్రకటించిన కవితపై కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత వైద్యం, ఉచిత విద్య వంటి హామీలు మంచివేనని, కానీ ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకొని వాటిపై పోరాడితేనే ప్రజలు నమ్ముతారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అలాగే రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల మధ్యకు వచ్చి హామీలు ఇస్తారని, కానీ గెలిచిన తర్వాత సామాన్యుల సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్యాస్, పెట్రోల్, నిత్యావసర ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి ప్రజల జీవనం రోజు రోజుకీ కష్టమవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

