నవయుగ ఇంజనీరింగ్‌పై అక్రమ నిర్మాణ ఆరోపణలు.. కలెక్టర్ రిపోర్ట్ ఉన్నా కదలని అధికారులు

నగరంలో ప్రముఖ నిర్మాణ సంస్థ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీపై అక్రమ నిర్మాణ ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మేడ్చల్–మల్కాజగిరి జిల్లా పరిధిలోని బేగంపేట ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి స్పష్టమైన నివేదికలు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సమాచారం ప్రకారం, సర్వే నంబర్లు 103 మరియు 103/2లో నిర్మాణానికి అనుమతి పొందిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ, వాస్తవానికి సర్వే నంబర్ 182లో నిర్మాణం చేపడుతోందని ఆరోపణలు ఉన్నాయి. దాదాపు ఒక ఎకరం ఎనిమిది గుంటల భూమిని ఆక్రమిస్తూ నిర్మాణం సాగుతోందని బాలానగర్ తహసీల్దార్ క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించినట్లు సమాచారం.

ఈ అంశంపై మేడ్చల్ మల్కాజగిరి కలెక్టరేట్ నుంచి పూర్తి ఆధారాలతో కూడిన నివేదిక సంబంధిత అధికారులకు పంపినట్లు తెలుస్తోంది. లొకేషన్ స్కెచ్‌లు, గ్రామ మ్యాపులు, భూ రికార్డులు వంటి కీలక ఆధారాలు ఉన్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది.

టౌన్ ప్లానింగ్ విభాగంలోని కొంతమంది అధికారులు ఫైళ్లను కావాలనే పెండింగ్‌లో ఉంచుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏఎస్పీ, సీసీపీ స్థాయి అధికారుల వద్ద ఫైళ్లు నిలిచిపోయాయని విమర్శలు ఉన్నాయి.

1955 హెచ్‌ఎంసీ చట్టం ప్రకారం అనుమతి పొందిన స్థలంలో కాకుండా వేరే ప్రాంతంలో నిర్మాణం చేస్తే అనుమతులను రద్దు చేసి వెంటనే నిర్మాణాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. అయితే ఈ కేసులో ఇప్పటివరకు అలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.

ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి సమీపంలోనే ఇలాంటి నిర్మాణం కొనసాగుతున్నా అధికారులు స్పందించకపోవడం ఆశ్చర్యకరమని స్థానికులు అంటున్నారు. చిన్న ఇల్లు కట్టుకునే సామాన్యులపై కఠిన నిబంధనలు అమలు చేసే అధికారులు, పెద్ద కంపెనీల విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నారని విమర్శిస్తున్నారు.

జిల్లా కలెక్టర్ పంపిన నివేదికపై తక్షణమే చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని పౌరసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు మల్కాజగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *