మా జీవితాలు నాశనం చేయొద్దు సార్”.. పవన్ కళ్యాణ్‌కు జనసేన కార్యకర్త భావోద్వేగ విజ్ఞప్తి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఓ పార్టీ కార్యకర్త చేసిన భావోద్వేగ విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కడప జిల్లాకు చెందిన జనసేన కార్యకర్త ఒకరు పార్టీ పరిస్థితులు, కార్యకర్తల బాధలు, గుర్తింపు లేకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.

“2014లో పార్టీ పెట్టిన రోజు నుంచి మేము మీ వెంటే ఉన్నాం. కానీ ఇప్పటికీ మా బతుకులు మారలేదు. కడపలో 10 మంది ఉంటే ఒక్కరికీ చైర్మన్ పోస్టు లేదు. కుక్కల్లా, బానిసల్లా బతుకుతున్నాం” అంటూ కార్యకర్త ఆవేశంగా మాట్లాడారు.

పవన్ కళ్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, “గుండెలు చీల్చితే మీరే కనిపిస్తారు సార్. మా జీవితాంతం మిమ్మల్ని మోస్తాం. కానీ మాకు కూడా సమాజంలో గౌరవం కావాలి” అన్నారు.

పార్టీ నిర్మాణంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. “15 ఏళ్లుగా పార్టీ ఉంది. కానీ ఇంకా కమిటీలు లేవు, ఇన్‌ఛార్జీలు లేరు. కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు లేదు. నాయకులు కార్యకర్తలను కలవడం లేదు” అంటూ వాపోయారు.

జనసేన పార్టీపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. “మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు వేయండి. కష్టపడే వాళ్లను గుర్తించండి. మమ్మల్ని పక్కన పెట్టొద్దు” అని కోరారు.

“మీరు సీఎం అయ్యే వరకు మేము పోరాడతాం సార్. మా ఆశలన్నీ మీ మీదే ఉన్నాయి. మమ్మల్ని మధ్యలో వదిలేయొద్దు” అంటూ భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు.

పార్టీ నుంచి సస్పెన్షన్లు, అంతర్గత విభేదాలపై కూడా స్పందిస్తూ, “ఒక తల్లి తన బిడ్డను దూరం చేయలేదుగా… అలాగే జనసేన కూడా మాది. మేము మిమ్మల్ని వదిలిపెట్టం” అన్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, జనసేన కార్యకర్తల ఆవేదనను ప్రతిబింబిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం పార్టీ అంతర్గత వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *