నీట్ పరీక్షల వివాదం మళ్లీ రగిలింది.. ఎన్టీఏ రద్దు చేయాలంటూ ఎస్ఎఫ్ఐ డిమాండ్

దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలపై మరోసారి వివాదం చెలరేగింది. నీట్ పరీక్ష నిర్వహణలో భారీ లోపాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తీవ్ర విమర్శలు చేశారు. మే 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షను రద్దు చేయాలని, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షలకుపైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారని, ఇప్పుడు పరీక్ష రద్దు నిర్ణయం వల్ల వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడే ప్రమాదం ఉందన్నారు. ప్రవేశ పరీక్షలు ముఖ్యంగా మెడికల్ సీట్ల కోసం నిర్వహించే పరీక్షలు అత్యంత పారదర్శకంగా, కట్టుదిట్టంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను ఒకే కేంద్రానికి పరిమితం చేసి పరీక్షలు నిర్వహించడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. 2024లో కూడా నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందని, ఆ సమయంలో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. ఇప్పుడు 2026లో మళ్లీ అదే తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయని విమర్శించారు.

ఎన్టీఏ నిర్వహిస్తున్న పరీక్షల్లో వరుసగా లోపాలు బయటపడుతున్నాయని, గతంలో యూజీసీ నెట్ పరీక్ష కూడా లీక్ అయిందని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ఎన్టీఏకు స్పష్టమైన విధానం లేదని, లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు.

“ఎక్కడో ఒక రాష్ట్రంలో, ఒక సెంటర్‌లో జరిగిన తప్పిదం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది విద్యార్థులు ఎందుకు నష్టపోవాలి?” అని ప్రశ్నించారు. మే 3న పరీక్ష రాసిన విద్యార్థులు ఇప్పటికే పరీక్ష పూర్తైందని భావించి రిలాక్స్ అయ్యారని, ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయాలని చెబితే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర విద్యాశాఖ, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై ఇప్పటికీ కఠిన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతి సంవత్సరం పేపర్ లీక్‌లు జరుగుతున్నప్పటికీ వాటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *