నీట్ పేపర్ లీక్ కలకలం.. 22 లక్షల విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారా?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఎంతో కష్టపడి, ఎన్నో ఆశలతో రాసిన పరీక్ష ఒక్కసారిగా రద్దవ్వడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

రాజస్థాన్‌లో పేపర్ లీక్ జరిగినట్టు వచ్చిన నివేదికల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ పరీక్షను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించింది. ఇప్పటివరకు 45 మందికి పైగా అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

అయితే ఈ ఘటనపై విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “దేశంలోనే అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీట్ పరీక్ష పేపర్ ఒక జిరాక్స్ సెంటర్, ప్రింటింగ్ ప్రెస్ స్థాయిలోనే లీక్ అవ్వడం అంటే ఇది ఎంతటి నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు” అంటూ పలువురు మండిపడుతున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం నాసిక్‌కు చెందిన ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నాపత్రం లీక్ అయి, అక్కడి నుంచి ఓ నెట్వర్క్ ద్వారా దేశంలోని పలు రాష్ట్రాలకు చేరినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. రాజస్థాన్, ఢిల్లీ, బీహార్, కేరళ, ఉత్తరాఖండ్ వరకు ఈ పేపర్ సర్క్యులేట్ అయినట్టు తెలుస్తోంది.

దర్యాప్తులో బయటపడుతున్న వివరాలు మరింత షాకింగ్‌గా ఉన్నాయి. లీకైన ప్రశ్నాపత్రాన్ని “గెస్ పేపర్” పేరుతో అమ్మినట్టు సమాచారం. ఒక్కో విద్యార్థికి 30 వేల నుంచి 28 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కేరళలో చదువుతున్న ఓ ఎంబిబిఎస్ విద్యార్థి ఈ పేపర్‌ను 28 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడని సమాచారం.

లీకైన పేపర్‌లోని ప్రశ్నలు అసలు నీట్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలతో దాదాపు సేమ్ టు సేమ్ మ్యాచ్ అయినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. బయాలజీ, కెమిస్ట్రీ విభాగాల్లో వందలాది ప్రశ్నలు ఒరిజినల్ ప్రశ్నాపత్రంతో సరిపోలినట్టు తేలింది. ఫుల్ స్టాప్‌లు, కామాలు కూడా అదే విధంగా ఉండటం గమనార్హం.

ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రెండేళ్లుగా కష్టపడి చదివి పరీక్ష రాసిన తర్వాత ఇప్పుడు మళ్లీ రీ ఎగ్జామ్ రాయాల్సి వస్తుందా అనే భయం వారిలో నెలకొంది. “ఇంత కష్టపడి చదివిన తర్వాత కూడా పరీక్షలపై నమ్మకం లేకపోతే మేమేం చేయాలి?” అంటూ పలువురు విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

పేపర్ లీక్‌లు కొత్త విషయం కాదని, గతంలో కూడా పలు పరీక్షల్లో ఇదే పరిస్థితి నెలకొన్నదని విమర్శలు వస్తున్నాయి. “ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు, మార్కులు అమ్ముకుంటున్నారు, ఎగ్జామ్స్ అమ్ముకుంటున్నారు” అంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రాజకీయంగానూ ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. కాంగ్రెస్ నేత Rahul Gandhi ఈ ఘటనను విద్యార్థుల భవిష్యత్తుపై దాడిగా అభివర్ణించగా, K. T. Rama Rao కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. అయితే గత ప్రభుత్వాల కాలంలోనూ పేపర్ లీక్‌లు జరిగాయని రాజకీయ ప్రత్యర్థులు కౌంటర్లు ఇస్తున్నారు.

ఇప్పటికే నీట్ పరీక్ష నిర్వహణ, ఎన్టీఏ పనితీరుపై దేశవ్యాప్తంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. “ఒక ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ లీక్ అయితే దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఎందుకు బలి కావాలి?” అనే ప్రశ్న ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *