సీలింగ్ భూముల్లో బటర్ఫ్లై సిటీ రెడీమిక్స్ ప్లాంట్.. అనుమతులు లేకుండా గలీజ్ దందా?

రంగారెడ్డి జిల్లాలో బటర్ఫ్లై సిటీ పేరుతో కొనసాగుతున్న రెడీమిక్స్ ప్లాంట్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. Fortune Infra Developers Private Limited ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ప్రాజెక్ట్‌పై స్థానిక రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కడ్తాల్ మండలం కొండ్రిగాని బోడు గ్రామ పంచాయతీ పరిధిలోని సీలింగ్ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా రెడీమిక్స్ ప్లాంట్ నిర్వహిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు.

రైతుల కథనం ప్రకారం సర్వే నెంబర్ 790/39లో ఉన్న సుమారు 3.20 ఎకరాల భూమిని ప్రభుత్వం సాగు కోసం పంపిణీ చేసిందని, తాము తరతరాలుగా సాగు చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. అయితే అదే భూమిలో బటర్ఫ్లై సిటీ యాజమాన్యం అక్రమంగా ప్లాంట్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆరోపిస్తున్నారు.

ఈ ఫిర్యాదులపై స్పందించిన గ్రామ పంచాయతీ అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. అనంతరం ఎలాంటి అనుమతులు లేకుండానే ప్లాంట్ నడుస్తోందని గుర్తించి నోటీసులు జారీ చేశారు. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ప్లాంట్ నిర్వహణ చట్టవిరుద్ధమని పేర్కొంటూ మూడు రోజుల్లోగా కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు.

ఇక ఈ వ్యవహారంలో మరింత ఆసక్తికర అంశం ఏమిటంటే, కంపెనీ యాజమాన్యం కూడా తమ తప్పును పరోక్షంగా ఒప్పుకుంది. భూమిని లీజుకు తీసుకుని రెడీమిక్స్ ప్లాంట్ నడుపుతున్నామని, లేఔట్ అభివృద్ధి పనుల కోసం దీనిని ఏర్పాటు చేశామని కంపెనీ ప్రతినిధులు లిఖితపూర్వకంగా తెలిపారు. అలాగే రెండేళ్లపాటు అనుమతులు ఇవ్వాలని అధికారులను కోరారు.

అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న అధికార యంత్రాంగంపైనే. ఇంత పెద్ద స్థాయిలో ప్లాంట్ నెలల తరబడి కొనసాగుతున్నప్పటికీ మైనింగ్, రెవెన్యూ, పంచాయతీ శాఖలు ఎందుకు స్పందించలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రైతులు ఫిర్యాదు చేసిన తర్వాతే అక్రమం బయటపడటం అధికారుల పనితీరుపై తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.

స్థానిక ప్రజలు మాత్రం యాజమాన్యంపై మాత్రమే కాకుండా సంబంధిత అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యం చేయకపోతే ఇలాంటి అక్రమాలు జరిగేవి కావని వారు అంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *