భగీరథ్ పోక్సో కేసులో కొత్త ట్విస్ట్.. స్నేహితుల విచారణ, కొత్త సెక్షన్లు నమోదు

కేంద్రమంత్రి Bandi Sanjay Kumar కుమారుడు Bandi Sai Bhagirath పై నమోదైన పోక్సో కేసు రోజురోజుకూ మరింత సంచలనంగా మారుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలుసెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు విచారణను మరింత వేగవంతం చేశారు. ముఖ్యంగా భగీరథ్ స్నేహితుల పాత్రపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.

బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదులో, ఘటన జరిగిన సమయంలో భగీరథ్ స్నేహితులు కూడా అక్కడే ఉన్నారని, అనంతరం విషయం బయటకు రాకుండా రాజీకి ప్రయత్నించారని పేర్కొన్నారు. సెటిల్మెంట్ కోసం ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తూ దాదాపు 10 మంది స్నేహితుల పేర్లను పోలీసులకు అందజేశారు.

దీంతో ప్రత్యేక అధికారి ఋతిరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు భగీరథ్ స్నేహితులను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఘటన జరిగిన రోజు అసలు ఏం జరిగింది? బాధితురాలు ఏమి చెప్పింది? భగీరథ్ ఎలా స్పందించాడు? రాజీ ప్రయత్నాలు ఎవరు చేశారు? వంటి అంశాలపై పోలీసులు ఆరా తీసి వారి స్టేట్మెంట్లను రికార్డు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ TT Madhavi Devi పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన దామోదర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేస్తే న్యాయమూర్తి కుటుంబానికి ప్రభుత్వ పదవి వస్తుందని తప్పుడు ప్రచారం చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇక భగీరథ్‌పై నమోదైన కేసులో పోలీసులు తాజాగా బీఎన్‌ఎస్ 64(2)(ఎం) సెక్షన్‌ను కూడా చేర్చినట్లు సమాచారం. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పోక్సో చట్టంలోని పలు కీలక సెక్షన్లు భగీరథ్‌పై అమలులో ఉన్నాయి.

అయితే ఈ కేసులో ఇంకా పలు అనుమానాలు కొనసాగుతున్నాయి. భగీరథ్ అరెస్ట్ విషయంలో పోలీసుల వాదన ఒకలా, కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉండటంతో చర్చ మొదలైంది. పోలీసులు “మేమే పట్టుకున్నాం” అంటుండగా, కుటుంబం మాత్రం “మేమే స్వయంగా అప్పగించాం” అని చెబుతోంది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఇలాంటి సున్నితమైన కేసుల్లో పారదర్శక విచారణ జరగాలని, చట్టం ముందు అందరూ సమానమే అన్న సందేశం వెళ్లాలని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *