పెట్రోల్ ధరలు పెరుగుతాయా..? యుద్ధ ప్రభావంతో సామాన్యుడిపై భారమా..?

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై మరోసారి చర్చ మొదలైంది. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు, చమురు సరఫరా అంతరాయాలు, ప్రపంచ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరల మార్పులతో భారతదేశంపై ప్రభావం పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయిల్, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్ కొరత వస్తుందా..? ధరలు మరింత పెరుగుతాయా..? అనే భయం సామాన్యుల్లో కనిపిస్తోంది.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ “పెట్రోల్ వాడకం తగ్గించండి.. బంగారం కొనుగోలు ఒక సంవత్సరం తగ్గించండి” అంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీశాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ.3 వరకు ధరలు పెంచడం మరింత చర్చనీయాంశమైంది. దీంతో త్వరలోనే మరో రూ.10 వరకు పెరుగుదల ఉండొచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటికే గతంలో కూడా “పెట్రోల్ కొరత వస్తుంది” అనే వార్తలతో ప్రజలు భారీగా బంకుల వద్ద క్యూ లైన్లలో నిలబడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఆయిల్ కంపెనీలు, పెట్రోలియం శాఖ అధికారులు “దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయి.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు” అంటూ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ యుద్ధ ప్రభావం కారణంగా అంతర్జాతీయ చమురు రవాణా వ్యవస్థ దెబ్బతింటే పరిస్థితి క్లిష్టమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా ప్రధాన సముద్ర మార్గాల ద్వారా జరుగుతుంది. ప్రస్తుతం యుద్ధ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు జరగడం, రవాణా ఆలస్యం కావడం వంటి అంశాలు ఆయిల్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. దీంతో పాకిస్తాన్, మయన్మార్, యూరప్ దేశాల్లో భారీగా పెట్రోల్ ధరలు పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు.

భారతదేశంలో పెట్రోల్ ధరలు ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ శాతంలోనే పెరిగాయని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే సామాన్యుడిపై మాత్రం దీని ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పెట్రోల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి, దాని ప్రభావం నిత్యావసర వస్తువులపై పడుతుంది. ఇప్పటికే సబ్బులు, సర్ఫ్‌లు, బిస్కెట్లు వంటి ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశాలపై కొన్ని కంపెనీలు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.

ఇక రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల విధానంపై కూడా రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు తక్కువగా ఉండగా, కొన్ని రాష్ట్రాల్లో అదనపు వ్యాట్ కారణంగా ధరలు ఎక్కువగా ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *