నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ.
ఉద్యోగం కోసం ఎన్నో ఆశలతో హైదరాబాద్‌కు వచ్చే యువతులను టార్గెట్ చేస్తూ ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిజామాబాద్‌కు చెందిన ఓ యువతి తనను ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, ప్రేమ పేరుతో దగ్గరై శారీరకంగా వాడుకుని చివరికి మోసం చేశాడంటూ ఓ వ్యక్తిపై సంచలన ఆరోపణలు చేసింది.
బాధితురాలు సౌమ్య తెలిపిన వివరాల ప్రకారం… 2021లో ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆమెకు “వర్క్ ఇండియా” అనే జాబ్ పోర్టల్ ద్వారా వినయ్ జేమ్స్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను “జేజీపీ సొల్యూషన్స్” అనే సంస్థ సీఈఓనని చెప్పుకున్న వినయ్, మొదట ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, తర్వాత ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడని ఆరోపించింది.
తన తండ్రి బ్రాహ్మణుడు, తల్లి క్రిస్టియన్ అని చెప్పి నమ్మకం కలిగించాడని, దేవాలయాలకు కూడా వెళ్లి హిందూ సంప్రదాయాలను పాటిస్తున్నట్టు ప్రవర్తించాడని బాధితురాలు పేర్కొంది. ఈ నమ్మకంతో తనతో రిలేషన్ కొనసాగించాడని, పెళ్లి చేస్తానని మాట ఇచ్చి శారీరక సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది.
ఈ సంబంధం కారణంగా 2023లో గర్భం దాల్చగా అబార్షన్ కూడా జరిగిందని ఆమె కన్నీటి పర్యంతమైంది. అయితే అబార్షన్ తర్వాత కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మళ్లీ రిలేషన్ కొనసాగించాడని తెలిపింది. ఆ సమయంలో తన ఆరోగ్య సమస్యలు, ఆపరేషన్ సమయంలో కూడా తానే చూసుకున్నానని పేర్కొంది.
తర్వాత పెళ్లి విషయాన్ని మాట్లాడుతున్న సమయంలో వినయ్ కుటుంబం నుంచి కూడా మాటలు వచ్చినట్లు తెలిపింది. అయితే అకస్మాత్తుగా అతను దూరం కావడం ప్రారంభించాడని, అనంతరం మరో యువతితో 2026లో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసి షాక్ అయ్యానని బాధితురాలు వెల్లడించింది.
తనను మోసం చేశాడనే విషయం బయటకు చెప్పడానికి మొదట భయపడ్డానని, కానీ మరో అమ్మాయి జీవితమూ నాశనం కాకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానని తెలిపింది. తన దగ్గర కలిసి దిగిన ఫోటోలు, మెసేజులు వంటి ఆధారాలు ఉన్నాయని చెప్పింది.
ఇప్పటికే ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు తెలుస్తోంది. కేసు పెట్టిన తర్వాత కూడా వినయ్ మాట్లాడేందుకు ముందుకు రావడం లేదని, అతని కుటుంబం కూడా సహకరించడం లేదని బాధితురాలు ఆరోపించింది.
నాతో చేసిన తప్పు ఒప్పుకోవాలి. నా లాగే ఇంకో అమ్మాయి మోసపోవద్దు. పెళ్లి అయిన తర్వాత కూడా ఇతను ఇతర అమ్మాయిలను మోసం చేసే అవకాశం ఉంది” అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

