తెలంగాణలో అవినీతి ఆరోపణలు మరోసారి సంచలనంగా మారాయి. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో భారీ లంచం వ్యవహారం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే నాలా కన్వర్షన్ అనుమతుల కోసం రైతుల నుంచి ఎకరాకు లక్ష రూపాయల చొప్పున మొత్తం ₹30 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.
అలియాబాద్ గ్రామానికి చెందిన 30 ఎకరాల భూమికి నాలా కన్వర్షన్ అనుమతులు కావాలని బాధితులు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. ఈ ప్రక్రియలో భాగంగా తహసీల్దార్ సుచరిత ఎకరాకు ₹1 లక్ష చొప్పున మొత్తం ₹30 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ విచారణలో బయటపడింది.
బాధితులు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించారు. ముందస్తు ఒప్పందం ప్రకారం బాధితులు ₹2 లక్షల అడ్వాన్స్‌ను తహసీల్దార్ ప్రైవేట్ డ్రైవర్ నాగరాజు అలియాస్ నాగేష్‌కు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
డ్రైవర్‌ను విచారించిన తర్వాత తహసీల్దార్ సుచరిత పేరు వెలుగులోకి రావడంతో అధికారులు ఆమెను సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసులో కీసర ఆర్డీవో రాజేష్‌ను కూడా ప్రశ్నించినట్లు సమాచారం. అనంతరం తహసీల్దార్ సుచరితను ఏ1గా, డ్రైవర్ నాగేష్‌ను ఏ2గా నమోదు చేసి అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.
ఇక శామీర్‌పేట్ రెవెన్యూ కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత మూడు సంవత్సరాల్లో ఇదే కార్యాలయానికి చెందిన ఇద్దరు తహసీల్దార్లు ఏసీబీకి చిక్కడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2024లో అప్పటి ఎంఆర్వో సత్యనారాయణ కూడా డ్రైవర్ ద్వారా ₹10 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం గుర్తుచేస్తున్నారు స్థానికులు.
ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే సామాన్య ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ప్రతి పనికీ లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు మరింత పెరుగుతున్నాయి. ముఖ్యంగా పేదవాళ్లు, రైతులు తమ పనులు చేయించుకోవడానికి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల టాక్స్ డబ్బులతో జీతాలు తీసుకుంటూ, అదే ప్రజల దగ్గర మళ్లీ లంచాలు అడగడం ఎంతవరకు సరైంది?” అంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఒక సాధారణ వ్యక్తి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే పని జరగాలంటే తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు బయటకు వస్తున్న కొద్దీ ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం తగ్గిపోతోందని, అవినీతి నియంత్రణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

