జగిత్యాలలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మరియు కేంద్ర ప్రభుత్వం వరి, మక్కజొన్న కొనుగోళ్లపై నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఆర్టీసీ డ్రైవర్ అశోక్ చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. అశోక్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే వ్యక్తం చేశాడని, దాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై తన అభిప్రాయాన్ని చెప్పినందుకు ఆయనపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదని వెల్లడించారు.
మంత్రి మాట్లాడుతూ, “జగిత్యాలలో జరుగుతున్న నిరసన కార్యక్రమం పక్కనుగా వెళ్తున్న అశోక్ డ్రైవర్ తన అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశాడు. మక్కజొన్న, వరి కొనుగోళ్ల విషయంలో రైతులకు సహాయం చేయాలని చెప్పాడు. దాన్ని మేము వ్యక్తిగత అభిప్రాయంగానే తీసుకున్నాం. ఆర్టీసీ అధికారులు ఉద్యోగ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు” అని తెలిపారు.
అశోక్‌కు రిమూవల్ లెటర్ వెళ్లిందన్న వార్తలపై స్పందించిన మంత్రి, “వాట్సాప్‌లో ఏ మెసేజ్ ఎలా వెళ్లిందో మాకు తెలియదు. ఈ విషయంపై ఇప్పటికే డీఎం, ఆర్ఎంలతో మాట్లాడాం. అశోక్‌పై ఎలాంటి అధికారిక చర్యలు లేవని వారు చెప్పారు. ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు” అన్నారు.
రైతుల పరిస్థితిపై కూడా మంత్రి ప్రస్తావిస్తూ, “ఈసారి మక్కజొన్న దిగుబడి ఎక్కువగా వచ్చింది. ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా ఉంది. అయినా రైతులకు ఇబ్బంది లేకుండా మా బాధ్యత నిర్వర్తిస్తున్నాం” అని పేర్కొన్నారు. చివరగా, అశోక్ అనే ఆర్టీసీ డ్రైవర్‌కు ఉద్యోగ పరంగా ఎలాంటి నష్టం జరగదని జిల్లా మంత్రిగా హామీ ఇస్తున్నానని తెలిపారు.

