ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్నో హామీలు ఇస్తున్నప్పటికీ భూమి స్థాయిలో మాత్రం పరిస్థితులు మారడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మాటలే ఎక్కువ.. చేతల్లో మాత్రం ఏమీ కనిపించడం లేదు” అంటూ రైతులు తమ అసంతృప్తిని వెల్లడిస్తున్నారు.
ఒక రైతు మాట్లాడుతూ, “ఆ రోజు కూడా ధాన్యం అమ్మడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. యార్డ్ దొరకలేదు, గంటల తరబడి లైన్లలో నిలబడ్డాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. రైతు పరిస్థితి మారలేదు” అని వాపోయాడు.
వ్యవసాయం చేయడమే భారంగా మారిందని రైతులు చెబుతున్నారు. “ఇప్పటికే రైతు వ్యవసాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు పంటలు వేసినా ఖర్చులు పెరిగిపోతున్నాయి. వచ్చే సంవత్సరం పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందేమోనని భయం వేస్తోంది” అని అన్నారు.
గతంలో పెద్ద ఎత్తున సాగు చేసేవాళ్లమని, ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని రైతులు చెబుతున్నారు. “ముందు 10 ఎకరాలు ఒకేసారి వేసేవాళ్లం. ఇప్పుడు ఎకరం ఎకరం చేసుకుంటూ సాగు చేస్తున్నాం. పెట్టుబడులు పెరిగిపోయాయి కానీ ఆదాయం మాత్రం రావడం లేదు” అని పేర్కొన్నారు.
రైతు భరోసా వంటి పథకాలు సకాలంలో అందడం లేదని, పంటలు పండించినా సరైన మద్దతు లేక రైతులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “అటు రైతు భరోసా రావడం లేదు.. ఇటు పంటలు పండిస్తే కొనేవాళ్లు లేరు. మరి రైతు ఎలా బతకాల?” అని ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే రైతుల గురించి మాట్లాడుతున్నారని, తర్వాత రైతుల సమస్యలు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. “మార్పు వస్తుందని ఆశపడ్డాం. కానీ రైతు జీవితం మాత్రం అలాగే ఉంది” అని రైతులు వాపోతున్నారు.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో రైతుల్లో తీవ్ర నిరాశ నెలకొన్నదని, ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధరలు, రైతు భరోసా వంటి అంశాలపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

