జైపూర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పేరుతో సింగరేణి సంస్థను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. డీపీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) లేకుండానే వేల కోట్ల రూపాయల పనులు ప్రారంభించడం వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఆయన అన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ, “సింగరేణి ఇప్పటికే జైపూర్‌లో 600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరో 800 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. కానీ ఏ పవర్ ప్రాజెక్టు అయినా ప్రారంభించే ముందు తయారయ్యే విద్యుత్‌ను ఎవరు కొనుగోలు చేస్తారనే దానిపై పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) ఉండాలి. అలాగే డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)కు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి” అని పేర్కొన్నారు.
“జైపూర్ 800 మెగావాట్ల ప్రాజెక్టుకు ఇప్పటి వరకు డీపీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేదు. ఏ విద్యుత్ సంస్థతోనూ పీపీఏ కుదరలేదు. అయినప్పటికీ టెండర్లు పిలిచి, తమకు అనుకూలమైన వారికి పనులు అప్పగించి, ఇప్పటికే సుమారు ₹1,000 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఏడాదిన్నర గడిచినా ప్రాజెక్టు నడుమనే ఆగిపోయింది” అని ఆరోపించారు.
రాజస్థాన్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న 76:24 జాయింట్ వెంచర్ ఒప్పందంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. “76 శాతం తెలంగాణ, 24 శాతం రాజస్థాన్ వాటాతో ఒప్పందం చేసుకున్నారు. అయితే రాజస్థాన్ ప్రభుత్వం నగదు పెట్టుబడి పెట్టకుండా, జైసల్మేర్ జిల్లాలో పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో 1,400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు భూమి ఇస్తామని చెప్పింది” అని తెలిపారు.
“సింగరేణి పని బొగ్గు ఉత్పత్తి చేయడం. అలాంటి సంస్థను పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన జైసల్మేర్‌కు తీసుకెళ్లి సోలార్ ప్లాంట్లు ఎందుకు పెట్టిస్తున్నారు? ఇది ప్రజా ప్రయోజనాల కోసం కాదు. కమిషన్ల కోసమే ఈ వ్యవహారం నడుస్తోంది. సింగరేణిని ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర జరుగుతోంది” అని హరీష్ రావు ఆరోపించారు.
అంతేకాకుండా, జైసల్మేర్‌లో టెండర్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు సింగరేణి అధికారులతో ప్రత్యేక కార్యాలయం కూడా ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. “తెలంగాణకు అవసరమా? నిజంగా సోలార్ విద్యుత్ అవసరం ఉంటే రాజస్థాన్ ప్రభుత్వం స్వయంగా ఏర్పాటు చేసుకునేది. కానీ సింగరేణిని బలిపశువుగా మార్చి కమిషన్ల కోసం వినియోగిస్తున్నారు” అని విమర్శించారు.
“జైపూర్ పవర్ ప్రాజెక్టుకు ఇప్పటికీ డీపీఆర్ ఆమోదం ఎందుకు రాలేదు? పీపీఏ ఎందుకు కుదరలేదు? తయారయ్యే విద్యుత్‌ను ఎవరు కొనుగోలు చేస్తారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్పై ఉంది. అందుకే ఈ అంశాలను ప్రజల ముందుకు తీసుకువస్తున్నాం. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిజాలను వెలికి తీస్తాం” అని హరీష్ రావు స్పష్టం చేశారు.

