హైదరాబాద్: నీట్, సీబీఎస్ఈ పరీక్షల పేపర్ లీకేజీలు, పెరుగుతున్న విద్యా ఫీజులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో “కాక్రోచ్ జనతా పార్టీ” పేరిట కొనసాగుతున్న ఉద్యమం ఇప్పుడు హైదరాబాద్‌కు చేరుకుంది. ఆదివారం ఇందిరా పార్క్ ధర్ణా చౌక్ వద్ద విద్యార్థులు, నిరుద్యోగ యువత, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ నిరసనలో ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలకు కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న వ్యవస్థపై సమగ్ర విచారణ జరపాలని ఆందోళనకారులు కోరారు.
చేతుల్లో రాజ్యాంగ ప్రతులు, జాతీయ జెండాలు పట్టుకుని, ముఖాలకు కాక్రోచ్ మాస్కులు ధరించిన నిరసనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి మద్దతు ప్రకటించారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ కూడా ఉద్యమానికి సంఘీభావం తెలిపినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, “దేశంలో ప్రశ్నపత్రాల లీకేజీలు సాధారణ ఘటనలుగా మారిపోయాయి. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు. మరోవైపు ఉద్యమ నేతలు 2014 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 80కి పైగా పేపర్ లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.
అయితే, ఈ ఉద్యమం కేవలం కేంద్ర ప్రభుత్వానికే పరిమితమవ్వాలా? అనే ప్రశ్న కూడా ముందుకొస్తోంది. తెలంగాణలోనూ విద్యా వ్యవస్థ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌ల జాప్యం, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కొరత, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ వంటి అంశాలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాల అమలుపై విద్యార్థుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత బకాయిలు చెల్లించకుండానే కొత్త విధానాలు తీసుకురావడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామనే హామీలపై స్పష్టత లేకపోవడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం ప్రైవేట్ విద్యా వ్యవస్థలో ఫీజుల నియంత్రణ లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. నర్సరీ నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి దశలో కొత్త పేర్లతో భారీ ఫీజులు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చదువు హక్కుగా కాకుండా వ్యాపారంగా మారిపోయిందనే అభిప్రాయం బలపడుతోంది.
ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం విద్యార్థుల సమస్యలను జాతీయ స్థాయిలో చర్చకు తీసుకువచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రంలో మార్పులు కోరుతూ రాష్ట్రాల్లో జరుగుతున్న లోపాలను విస్మరిస్తే ఉద్యమం అసంపూర్ణంగా మిగిలిపోతుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ప్రారంభమైన ఈ ఉద్యమం రాజకీయాలకు అతీతంగా కొనసాగితేనే దీర్ఘకాలిక మార్పులకు దారి తీసే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే ఇది కూడా మరో రాజకీయ ఆరోపణల వేదికగా మారిపోతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పేపర్ లీకేజీలు ఆగాలి, విద్యా వ్యవస్థలో పారదర్శకత పెరగాలి, ఫీజుల నియంత్రణ ఉండాలి, విద్యార్థులకు న్యాయం జరగాలి. ఇదే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న విద్యార్థుల స్వరం.

