తెలంగాణలో విద్యారంగ సమస్యలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలు తీవ్ర ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత, కార్పొరేట్ విద్యాసంస్థల పెత్తనం, ఫీజుల నియంత్రణ లేకపోవడం, మౌలిక సదుపాయాల కొరత వంటి అంశాలపై ఏబీవీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏబీవీపీ నాయకుల ఆరోపణల ప్రకారం, రాష్ట్రంలో ఒకప్పుడు సుమారు 27 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య భారీగా తగ్గి దాదాపు 4 వేల వరకు మాత్రమే మిగిలే పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం, ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడం, ఎంఈఓలు, డీఈఓల పోస్టులను వెంటనే నింపాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనీసం 20 శాతం సీట్లు కేటాయించాలని కోరారు.
ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని, 2020 జాతీయ విద్యా విధానాన్ని (NEP-2020) రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. విద్యను వ్యాపారంగా మార్చే కార్పొరేట్ వ్యవస్థను అరికట్టాలని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
గురుకుల పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయడం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను సకాలంలో అందించాలని కోరింది. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేల కార్యాలయాల ముట్టడికి దిగుతామని ఏబీవీపీ నేతలు హెచ్చరించారు.
విద్య హక్కును పరిరక్షించేందుకు తమ ఉద్యమం కొనసాగుతుందని, పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటం ఆపబోమని ఏబీవీపీ స్పష్టం చేసింది.

