మెట్రో ఆస్తులపై కన్నేసిన ప్రభుత్వం..? ఎల్‌అండ్‌టీ అప్పుల భారం ప్రజలపైనేనా..? కేటీఆర్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌పై తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడెక్కిన చర్చ మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. మెట్రో రైలు ప్రాజెక్టు వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు.
హైదరాబాద్‌లో మెట్రోపై ఉన్న దాదాపు 30 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్నేశారని కేటీఆర్ విమర్శించారు. ఈ ఆస్తులను తన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మెట్రో నిర్వహణలో కీలక భాగస్వామిగా ఉన్న ఎల్‌అండ్‌టీ సంస్థ అధికారులను ఒత్తిళ్లకు గురిచేసి రాష్ట్రం నుంచి వెళ్లిపోయే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు.
దాదాపు 12 ఏళ్లుగా హైదరాబాద్ మెట్రో నిర్వహణలో భాగస్వామిగా ఉన్న ఎల్‌అండ్‌టీ సంస్థ అకస్మాత్తుగా 14 వేల కోట్ల రూపాయల అప్పులు చూపించడం అనుమానాలకు తావిస్తోందని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారని, స్టేషన్లలో ప్రకటనలు, వాణిజ్య సముదాయాలు, అద్దెల రూపంలో భారీ ఆదాయం వస్తున్నప్పటికీ సంస్థ నష్టాల్లోకి ఎలా వెళ్లిందని ప్రశ్నించారు.
మెట్రో స్టేషన్ల కింద ఏర్పాటు చేసిన వాణిజ్య దుకాణాలు, ప్రకటన హోర్డింగ్స్, ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న చార్జీల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కడికి వెళ్తోందని ఆయన నిలదీశారు. ఆదాయం పెరుగుతున్నా నష్టాలు పెరిగాయని చెప్పడం వెనుక అసలు నిజం ఏమిటో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడానికి 18 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందనే ప్రచారం జరుగుతోందని, ఆ మొత్తాన్ని చివరకు ప్రజలే భరించాల్సి వస్తుందని కేటీఆర్ అన్నారు. ఎల్‌అండ్‌టీ చూపిస్తున్న 14 వేల కోట్ల అప్పు కూడా చివరికి ప్రజల నెత్తినే పడుతుందని విమర్శించారు.
ఇక మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి 45 వేల కోట్ల రూపాయల వ్యయంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో నిధులు సమకూర్చినా, ఆ డబ్బు మొత్తం అప్పుల రూపంలోనే వస్తుందని, దాంతో తెలంగాణ ప్రజలపై అప్పుల భారం మరింత పెరుగుతుందని అన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో ప్రతి వ్యక్తిపై సగటున లక్షా యాభై వేల రూపాయల అప్పు ఉందని, కొత్తగా తీసుకొస్తున్న రుణాలతో ఈ భారం మరింత పెరిగే ప్రమాదం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఒకవైపు ఫ్యూచర్ సిటీ, మరోవైపు మెట్రో ప్రాజెక్టులు, ఇంకోవైపు బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం అప్పుల మీదే ఆధారపడుతోందని విమర్శించారు.
హైదరాబాద్ మెట్రో విస్తరణ విషయంలో కూడా కేంద్రం చిత్తశుద్ధి లేదని కేటీఆర్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన లకిడీకాపూల్ – పటాన్‌చెరు మెట్రో కారిడార్‌కు ఎందుకు ఆమోదం ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఇప్పుడు మెట్రోపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడటం ప్రజలను మభ్యపెట్టడానికేనని అన్నారు.
హైదరాబాద్ నగర అభివృద్ధి, మెట్రో భవిష్యత్తు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, అప్పులు ఎంత అనే విషయాలను పారదర్శకంగా ప్రజల ముందుంచాలని ఆయన సూచించారు.
మెట్రో ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న వ్యవహారాలపై పూర్తి స్పష్టత ఇవ్వకపోతే ప్రజల్లో అనుమానాలు మరింత పెరుగుతాయని కేటీఆర్ హెచ్చరించారు.

