‘జీవన్ కుమార్‌కు అండగా నిలవలేని బీఆర్ఎస్.. కార్యకర్తలను ఎలా కాపాడుతుంది?’ – కేటీఆర్, మహిపాల్ రెడ్డిని ప్రశ్నించిన నాయకుడు

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చేసిన వ్యాఖ్యలపై ఓ నాయకుడు తీవ్ర విమర్శలు చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త జీవన్ కుమార్ భూ వివాదాన్ని ప్రస్తావిస్తూ, పార్టీ నాయకత్వం సొంత కార్యకర్తకే అండగా నిలవలేదని ఆరోపించారు.

ఆయన మాట్లాడుతూ, పటాన్‌చెరులో దళిత సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త జీవన్ కుమార్ కుటుంబం తరతరాలుగా సాగు చేస్తున్న భూమిని ఎస్టీపీ ప్లాంట్ కోసం ప్రభుత్వ అధికారులు ఖాళీ చేయించాలని ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఆశ్రయించగా, “ఆ పొలం సంగతి మర్చిపో” అనే సమాధానం వచ్చిందని ఆరోపించారు.

మూడుసార్లు పార్టీ జెండా మోసి గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తకు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలం, బలగమని చెప్పుకునే నాయకులు, సమస్య వచ్చినప్పుడు వారిని గాలికి వదిలేయడం సరైన రాజకీయ విధానం కాదని విమర్శించారు.

గూడెం మహిపాల్ రెడ్డి గురించి గతంలో మాట్లాడితే ఆయన అభిమానులు, కార్యకర్తలు తీవ్రంగా స్పందించేవారని, అలాంటి నిబద్ధత కలిగిన కార్యకర్తలనే ఇప్పుడు నిరాశపరుస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఈ అంశాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నానని పేర్కొన్న ఆయన, “పటాన్‌చెరుకు చెందిన మీ సొంత కార్యకర్త జీవన్ కుమార్‌కే పార్టీ అండగా నిలవలేకపోతే, ఇతర కార్యకర్తలకు ఎలా అండగా ఉంటారు?” అని ప్రశ్నించారు.

పార్టీని బలోపేతం చేయాలంటే ముందుగా కార్యకర్తల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని, లేకపోతే భవిష్యత్తులో రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *