దేశ రాజకీయాల్లో మరోసారి విద్యార్హతలు, పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఉద్యమాలు హాట్ టాపిక్‌గా మారాయి. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్ కే ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలపై ప్రశ్నలు లేవనెత్తగా, మరోవైపు జార్ఖండ్‌లో పేపర్ లీకేజీ ఆరోపణలపై విద్యార్థుల ఆందోళనలు ఉధృతమయ్యాయి.
అమెరికాలో తన చదువుకు సంబంధించిన ఖర్చులపై వస్తున్న విమర్శలకు స్పందించిన అభిజిత్ దీప్ కే, తన విద్యకు సంబంధించిన స్కాలర్షిప్, ఎడ్యుకేషన్ లోన్ వివరాలన్నింటినీ బహిర్గతం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన డిగ్రీకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని సవాల్ విసిరారు. అలాగే బీజేపీ నాయకులు కూడా తమ విద్యార్హతలను వెల్లడించాలని ఆయన ఎక్స్ (X) వేదికగా డిమాండ్ చేశారు.
“ఒక సాధారణ యువకుడు అమెరికాలో చదువుకుంటే ఎందుకు ఇంత విమర్శలు వస్తున్నాయి? అన్ని అనుమానాలకు సమాధానంగా నా విద్యా రుణం, స్కాలర్షిప్ వివరాలు వెల్లడిస్తాను. అదే విధంగా ప్రధాని కూడా తన విద్యార్హతలకు సంబంధించిన వివరాలు వెల్లడించాలి” అని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 15 ఏళ్ల బాలికపై కేసు నమోదు చేయకూడదని ఢిల్లీ పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం. తొలుత నోయిడా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ, బాలిక తన వయసు 15 సంవత్సరాలని, ఇతరుల ప్రభావంతో ఆ వ్యాఖ్యలు చేసినట్లు క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేసింది. అనంతరం ప్రధాని మోదీ కూడా ఆ బాలికను క్షమిస్తున్నట్లు ప్రకటించడంతో పోలీసులు తదుపరి చర్యలు తీసుకోలేదని సమాచారం.
మరోవైపు జార్ఖండ్‌లో పేపర్ లీకేజీ ఆరోపణలతో విద్యార్థుల ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చింది. ఏప్రిల్ 19న నిర్వహించిన 14వ జేపీఎస్సీ కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని, జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నిర్వహించిన ఇతర పరీక్షలపై కూడా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో రాంచీలో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. జూలై 2న ఫలితాలు వెలువడిన తర్వాత పేపర్ లీకేజీకి సంబంధించిన ఆధారాలను గవర్నర్, ముఖ్యమంత్రికి సమర్పించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆయన ఆరోపించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు ప్రకటించింది. విద్యార్థుల డిమాండ్లకు పూర్తి మద్దతు ఉంటుందని అభిజిత్ దీప్ కే ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా తరచూ వెలుగులోకి వస్తున్న పేపర్ లీకేజీ ఘటనలపై విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో పరీక్షల నిర్వహణలో పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో నియామక వ్యవస్థలో సాంకేతిక మార్పులు తీసుకురావాలని, పరీక్షల భద్రతను మరింత పటిష్టం చేయాలని విద్యార్థులు, నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం జార్ఖండ్‌లో కొనసాగుతున్న ఈ ఉద్యమం ఎలా ముగుస్తుంది? ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

