ప్రశ్నించడమే నేరమైతే కాల్చి చంపండి”.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కార్యకర్త ఆవేదన

ప్రశ్నించడమే నేరమైతే నన్ను కాల్చి చంపండి” అంటూ ఓ కార్యకర్త జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం నివాసం వద్దకు వెళ్లిన తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు.

“ఉదయం 11:30 గంటలకు నన్ను అరెస్ట్ చేశారు. సీఎం ఇంటి దగ్గరకు మీడియాతో కలిసి వెళ్లాం. భగీరథ్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించడానికి వెళ్లాం. సీఎం ఇంట్లో ఉన్నాడేమో అనే అనుమానం మాకు ఉంది. అక్కడి నుంచి నన్ను తీసుకువచ్చి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పెట్టారు” అని కార్యకర్త తెలిపారు.

పోలీసులు తనను గంటల తరబడి స్టేషన్‌లో ఉంచినా కనీసం తాగడానికి టీ కూడా ఇవ్వలేదని, తన స్నేహితులు తెచ్చిన నీళ్లతోనే ఉన్నానని ఆరోపించారు. “ఉదయం నుంచి ఇప్పటివరకు ఒక్క చాయ కూడా ఇవ్వలేదు. భోజనం కూడా ఆఫర్ చేయలేదు. నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ఎస్సీపీకి ఫోన్ చేసినప్పటికీ “ఇప్పుడే వదిలేస్తాం” అని చెప్పి తర్వాత స్పందించడం లేదని ఆరోపించారు. “భగీరథ్‌ను అరెస్ట్ చేయమని అడిగితే నేను పెద్ద నేరస్తుడినయ్యానా? హోం మంత్రికొడుకుని అరెస్ట్ చేయమంటే అంత పెద్ద నేరమా?” అంటూ ప్రశ్నించారు.

ఇంకా మాట్లాడుతూ, “నేను బయటకు వెళ్లను. భగీరథ్‌ను అరెస్ట్ చేసే వరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోనే దీక్ష కొనసాగిస్తా. నా మీద కేసులు పెట్టాలనుకుంటే పెట్టండి. జైలుకు పంపాలంటే పంపండి. అవసరమైతే కాల్చి చంపండి. కానీ ప్రశ్నించడం తప్పు కాదు” అని వ్యాఖ్యానించారు.

ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవైపు భగీరథ్‌పై నమోదైన కేసులో వెంటనే చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తుండగా, మరోవైపు చట్ట ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *