మమ్మల్ని చంపేస్తామంటున్నారు”.. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌పై పీజీ నిర్వాహకుల ఆరోపణలు

హైదరాబాద్ అమీర్‌పేటలో నిర్వహిస్తున్న ఓ గర్ల్స్ పీజీ హాస్టల్ విషయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమను బెదిరిస్తూ, హాస్టల్‌ను బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని పీజీ నిర్వాహకులు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య శ్రీదేవిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ప్రభుత్వాన్ని, పోలీసులను వేడుకుంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఏషియన్ పీజీ ఫర్ గర్ల్స్ నిర్వహిస్తున్న వీర హనుమాన్ రెడ్డి మాట్లాడుతూ, గత మూడు రోజులుగా 20 నుంచి 30 మంది వ్యక్తులతో కలిసి బొంతు రామ్మోహన్, శ్రీదేవి తమ హాస్టల్ డైనింగ్ హాల్‌లో కూర్చొని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. “హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోండి.. లేకపోతే చంపేస్తాం” అంటూ తమను భయపెడుతున్నారని అన్నారు.

హాస్టల్‌లో ఉండే విద్యార్థినులను కూడా ఖాళీ చేయించాలని ఒత్తిడి తెస్తున్నారని, “మీ డబ్బులు తిరిగి ఇస్తాం.. మీరు వెళ్లిపోండి.. ఇక నుంచి హాస్టల్ మేమే నడుపుతాం” అంటూ విద్యార్థులపై కూడా ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. తమ సిబ్బంది ఫోన్లు లాక్కోవడం, సమాచారం బయటకు వెళ్లకుండా అడ్డుకోవడం జరుగుతోందని ఆరోపించారు.

వీర హనుమాన్ రెడ్డి భార్య శివపార్వతి మాట్లాడుతూ, గత 21 సంవత్సరాలుగా హాస్టల్ వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. మూడు సంవత్సరాల క్రితం బొంతు శ్రీదేవి తల్లి బాయమ్మ వద్ద నుంచి ఈ భవనాన్ని అద్దెకు తీసుకున్నామని చెప్పారు. అయితే అప్పటి నుంచి నిరంతరం వేధింపులు ఎదుర్కొంటున్నామని ఆరోపించారు.

తాము రెండు కోట్ల రూపాయలు పెట్టుబడిగా ఇచ్చామని, చెక్కుల ద్వారా చెల్లింపులు చేశామని, కానీ ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయని తెలిపారు. ఆ విషయంలో కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయని చెప్పారు. కోర్టు తమకు స్టేటస్ కో ఇచ్చినా కూడా దానిని పట్టించుకోకుండా బెదిరింపులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

శివపార్వతి మాట్లాడుతూ, “జిహెచ్ఎంసి సిబ్బంది, హిజ్రాలు, రౌడీలను పంపించి పలుమార్లు మాపై దాడులు చేయించారు. నన్ను జుట్టు పట్టుకుని కొట్టారు. మా కుటుంబాన్ని జైలుకి కూడా పంపించారు. మా పిల్లలను, సిబ్బందిని కూడా బెదిరిస్తున్నారు” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

ఇప్పటికే తన భర్తకు గుండెపోటు వచ్చి మూడు స్టంట్లు వేయించుకోవాల్సి వచ్చిందని, కుటుంబం మొత్తం తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మేయర్ రాజకీయ ప్రభావంతోనే ఈ వేధింపులు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జోక్యం చేసుకుని తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని వేడుకున్నారు.

“మాకు దిక్కులేదు సార్.. మమ్మల్ని కాపాడండి” అంటూ వారు ప్రభుత్వాన్ని చేతులెత్తి ప్రార్థించారు.

ఈ వ్యవహారం ప్రస్తుతం అమీర్‌పేట ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలపై బొంతు రామ్మోహన్ లేదా ఆయన కుటుంబ సభ్యుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *