బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడుతున్న రమ్య.. సహాయం కోసం కుటుంబం ఆర్తనాదం

హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువతి రమ్య గత నాలుగు సంవత్సరాలుగా బ్రెయిన్ ట్యూమర్‌తో తీవ్రంగా పోరాడుతోంది. ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు జరిగినప్పటికీ, వ్యాధి మళ్లీ తిరగబెట్టడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబం ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం ప్రజల సహాయం కోరుతోంది.

రమ్య తల్లి తెలిపిన వివరాల ప్రకారం, మొదటగా గాంధీ ఆసుపత్రిలో ట్యూమర్‌కు ఆపరేషన్ చేశారు. అనంతరం కొంతకాలం పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ, రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ తీవ్ర తలనొప్పి, పిట్స్ రావడం వంటి సమస్యలు మొదలయ్యాయి. దీంతో మరోసారి చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి వెళ్లగా, రెండో శస్త్రచికిత్స చేశారు.

అయితే ఆ ఆపరేషన్ తర్వాత కూడా పూర్తిగా కోలుకోలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇటీవల తల భాగంలో సమస్య మరింత పెరిగి, పరిస్థితి భయంకరంగా మారిందని తెలిపారు. ప్రస్తుతం రమ్యకు నడవడం కూడా కష్టంగా మారిందని, ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యుల సహాయం అవసరమవుతోందని పేర్కొన్నారు.

తర్వాత నిమ్స్ ఆసుపత్రిని సంప్రదించినా, గతంలో ఆపరేషన్ చేసిన వైద్యుల దగ్గరే చికిత్స చేయించుకోవాలని చెప్పారని కుటుంబం వాపోయింది. అనంతరం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, లక్షల రూపాయల ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.

రమ్య తల్లి మాట్లాడుతూ, “మా భర్తకు పక్షవాతం ఉంది. నేను కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నడుపుతున్నాను. ఇప్పటి వరకు అమ్మాయి కోసం ఎంతైనా పోరాడాం. ఇప్పుడు మా దగ్గర డబ్బుల్లేవు. ఎవరికైనా దయ ఉంటే మా బిడ్డను కాపాడండి” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ ఘటనపై స్పందించిన ఓకే టీవీ, ప్రజలు ముందుకు వచ్చి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని కోరింది. అలాగే వైద్యులు, సేవా సంస్థలు కూడా స్పందించి రమ్యకు మెరుగైన చికిత్స అందించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

రమ్య చికిత్స కోసం సహాయం చేయాలనుకునే వారు కుటుంబ సభ్యులను నేరుగా సంప్రదించి లేదా ఆన్‌లైన్ ద్వారా ఆర్థిక సహాయం అందించవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *