పేద ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొందరు వైద్యుల నిర్లక్ష్యం రోగుల ప్రాణాలపై ముప్పుగా మారుతోందన్న ఆరోపణలు మళ్లీ వినిపిస్తున్నాయి. తాజాగా సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వెలుగుచూసిన ఒక ఘోర ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కాన్పు చేసిన బాలింత కడుపులో కాటన్ మర్చిపోయిన వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆమె నెల రోజుల పాటు నరకయాతన అనుభవించిన ఘటన సంచలనం రేపుతోంది.
మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన నందిని అనే గర్భిణి గత నెల ఏప్రిల్ 14న ప్రసవం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అక్కడ విధుల్లో ఉన్న లేడీ డాక్టర్ సింధూరి ఆమెకు ఆపరేషన్ చేసి మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే డెలివరీ అనంతరం అధిక రక్తస్రావం కావడంతో బ్లీడింగ్ నియంత్రించేందుకు వైద్యురాలు నందిని శరీరం లోపల కాటన్ ఉంచినట్లు సమాచారం.
అయితే బ్లీడింగ్ తగ్గిన తర్వాత ఆ కాటన్ తొలగించాల్సి ఉండగా, దానిని పూర్తిగా మర్చిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ కాటన్‌ను తిరిగి తీసేయాల్సి ఉంటుందని పేషెంట్‌కు లేదా కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన నందిని శరీరంలో కాటన్ నెల రోజుల పాటు అలాగే ఉండిపోయింది.
రోజులు గడుస్తుండగా కాటన్ లోపల కుళ్లిపోవడంతో తీవ్రమైన ఇన్ఫెక్షన్ వ్యాపించింది. నందినికి తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరం రావడంతో ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. పుట్టిన బిడ్డకు పాలివ్వలేని పరిస్థితికి చేరుకుంది.
బాధితురాలి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కడుపులో కాటన్ ఉండిపోయిన విషయం బయటపడింది. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన వైద్య నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని ప్రైవేట్ వైద్యులు వెల్లడించడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.
ఈ విషయం తెలిసిన వెంటనే నందిని కుటుంబ సభ్యులు, బంధువులు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యురాలైన లేడీ డాక్టర్ సింధూరిని వెంటనే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ఘటన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యత, పర్యవేక్షణ వ్యవస్థలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. రోగుల భద్రత విషయంలో మరింత కఠినమైన విధానాలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

