డే కేర్‌లో ఘోరం.. 23 నెలల చిన్నారిని 25 సార్లు కొరికిన మరో చిన్నారి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
పిల్లలను సురక్షితంగా చూసుకుంటారని నమ్మి డే కేర్ సెంటర్లలో వదిలే తల్లిదండ్రులకు మహారాష్ట్రలో జరిగిన ఓ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేవలం 23 నెలల చిన్నారిని మరో రెండేళ్ల చిన్నారి ఏకంగా 25 సార్లకు పైగా కొరికిన ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డ్ కావడంతో డే కేర్ నిర్వహణలోని నిర్లక్ష్యం బట్టబయలైంది.
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ప్రీ-స్కూల్ డే కేర్ సెంటర్లో ఈ ఘటన జూన్ 22న జరిగింది. ఎప్పటిలాగే ఉదయం తమ 23 నెలల కుమారుడిని డే కేర్‌లో వదిలిన తల్లిదండ్రులు, కొన్ని గంటల తర్వాత ఊహించని పరిస్థితిని ఎదుర్కొన్నారు.
సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, పిల్లలతో ఉన్న ఓ సిబ్బంది ఒక చిన్నారిని బయటకు తీసుకెళ్లి, మిగిలిన ముగ్గురు చిన్నారులను గదిలోనే ఉంచి బయట నుంచి తలుపు లాక్ చేసి వెళ్లిపోయారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆ గదిలో ఒక్క సిబ్బంది కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ సమయంలో గదిలో ఉన్న మరో రెండేళ్ల చిన్నారి, 23 నెలల బాలుడిపై దాడి చేశాడు. సుమారు 15 నిమిషాల పాటు బాలుడిని 25 సార్లకు పైగా కొరికినట్లు సీసీటీవీ వీడియోలో కనిపించింది. బాధతో చిన్నారి ఏడుస్తూ సహాయం కోసం ప్రయత్నించినా, అక్కడ ఎవరూ లేకపోవడంతో అతడికి వెంటనే సహాయం అందలేదు.
మధ్యాహ్నం చిన్నారిని తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులకు మొదట చిన్నపాటి గీతలు మాత్రమే పడ్డాయని డే కేర్ సిబ్బంది చెప్పినట్లు సమాచారం. అయితే ఇంటికి వెళ్లి దుస్తులు మార్చే సమయంలో చిన్నారి ముఖం, ముక్కు, పెదాలు, ఛాతి, వీపు, చేతులు, కాళ్లపై అనేక కొరికిన గాయాలు కనిపించాయి. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని తల్లిదండ్రులు కోరగా, మొదట యాజమాన్యం పూర్తి వివరాలు వెల్లడించలేదని ఆరోపణలు వచ్చాయి. చివరకు వీడియో బయటకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి డే కేర్ యాజమాన్యం, సీఈఓతో పాటు సంబంధిత సిబ్బందిపై నిర్లక్ష్యానికి సంబంధించిన కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. తనిఖీల సమయంలో అవసరమైన రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించలేకపోవడంతో డే కేర్ సెంటర్‌ను మూసివేయాలని అధికారులు ఆదేశించినట్లు సమాచారం.
ఈ ఘటన మరోసారి డే కేర్ సెంటర్లలో పిల్లల భద్రతపై కీలక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఉద్యోగాల కోసం బయటకు వెళ్లే తల్లిదండ్రులు తమ చిన్నారులను డే కేర్లలో వదిలి వెళ్తున్నారు. అలాంటి కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు ఎంత కచ్చితంగా అమలవుతున్నాయి? పిల్లలపై నిరంతర పర్యవేక్షణ ఉందా? అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే వ్యవస్థ ఉందా? అనే అంశాలపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది.
పిల్లల భద్రత విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన స్పష్టం చేసింది. డే కేర్ సెంటర్లలో కఠినమైన భద్రతా నిబంధనలు, నిరంతర పర్యవేక్షణ, బాధ్యతాయుతమైన సిబ్బంది ఎంత అవసరమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.

