ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. మనస్థాపంతో రైతు ఆత్మహత్యాయత్నం

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల జాప్యం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి ధాన్యం నిల్వ ఉండిపోవడంతో రైతులు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన హామీలు అమలు కాకపోవడంతో రైతాంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

ప్రత్యేకంగా యూరియా కొరత, టోకెన్ వ్యవస్థలో గందరగోళం, కొనుగోళ్లలో ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంట పండించేందుకు ఎండలోనూ, వర్షంలోనూ కష్టపడి వ్యవసాయం చేసిన రైతులు చివరికి ధాన్యం అమ్ముకునే సమయంలో అవస్థలు పడుతున్నారు.

తాజాగా Lingala Ghanpur మండలంలోని ఎన్నేబావి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ధాన్యం కొనుగోలు జాప్యంతో తీవ్ర మనస్థాపానికి గురైన రైతు పొన్నం తిరుమలేష్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అప్రమత్తమై వెంటనే అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

స్థానిక రైతుల కథనం ప్రకారం, గత నెల రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు టోకెన్ సిస్టమ్ ద్వారా ధాన్యం కాంటా వేస్తామని చెప్పినా అమలులో మాత్రం తీవ్ర గందరగోళం నెలకొన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

రైతు తిరుమలేష్‌కు టోకెన్ నెంబర్ 16 వచ్చిందని, తన వంతు కోసం ఎదురు చూస్తుండగా తర్వాత వచ్చిన రైతుల ధాన్యాన్ని ముందుగా కాంటా వేయడంపై ఆయన ప్రశ్నించాడట. అయితే నిర్వాహకులు “నీ టోకెన్ 16 కాదు, 76” అంటూ మాట మార్చారని రైతులు చెబుతున్నారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన తిరుమలేష్ ఆత్మహత్యాయత్నానికి దిగినట్లు సమాచారం.

రైతులు మాట్లాడుతూ, “పంట పండించేందుకు యూరియా కోసం రాత్రంతా క్యూల్లో నిలబడ్డాం. ఒక బస్తా కోసం గంటల తరబడి వేచి చూశాం. అప్పులు చేసి పంట పండించాం. ఇప్పుడు ధాన్యం కొనకుండా ఇబ్బంది పెడుతున్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ప్రభుత్వం రైతు భరోసా, మద్దతు ధరలు, వేగవంతమైన కొనుగోళ్లు అంటూ హామీలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. “కొంటాం అంటున్నారు.. కానీ ఎప్పుడు కొంటారో తెలియడం లేదు” అంటూ రైతాంగం మండిపడుతోంది..

రైతుల సమస్యలపై వెంటనే స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని, టోకెన్ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని స్థానిక రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే మరిన్ని విషాదాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *