గాంజా మహమ్మారిపై జనగర్జన.. యువతను కాపాడాలంటే సమాజం మొత్తం ముందుకు రావాలి

గాంజా అనే మత్తు పదార్థం యువత జీవితాలను నాశనం చేస్తోందని, దీనిపై ప్రభుత్వం మాత్రమే కాకుండా సమాజం మొత్తం పోరాడాలని సామాజిక కార్యకర్త నాగరాజు అన్నారు. గాంజా నియంత్రణపై నిర్వహించిన “జనగర్జన” కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గాంజా సాగు దశలోనే అరికట్టగలిగితే మార్కెట్ దాకా రాకుండా నియంత్రించవచ్చని చెప్పారు.

గాంజా అనేది సాధారణంగా పొలాలు, తోటల్లో రహస్యంగా పండిస్తారని, కొన్ని ప్రాంతాల్లో మిరప పంటల మధ్య సాగు చేస్తూ వాసన బయటపడకుండా చూస్తారని ఆయన వివరించారు. పక్క రాష్ట్రాల నుంచి భారీ వాహనాల్లో ఇతర సరుకులతో కలిపి గంజాయిని తరలిస్తున్నారని తెలిపారు. ఈ వ్యవస్థలో పండించే వాళ్లు, రవాణా దారులు, డీలర్లు, మధ్యవర్తులు ఇలా అనేక మంది భాగస్వాములై ఉంటారని పేర్కొన్నారు.

గతంలో తాము పనిచేసిన సమయంలో భారీగా గాంజా తరలిస్తున్న టిప్పర్‌ను పట్టుకున్న ఘటనను గుర్తు చేసిన నాగరాజు, సమాచారం అందితేనే ఇలాంటి నెట్‌వర్క్‌లను ఛేదించగలమన్నారు. గ్రామస్థాయిలో ప్రజలు, రైతులు, యువత కలిసి సమాచారాన్ని అందిస్తేనే నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. అయితే సమాచారం ఇచ్చిన వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఈ సమస్యను కేవలం పోలీసులు లేదా ఎక్సైజ్ శాఖ ఒక్కటే పరిష్కరించలేవని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ వాటి అమలులో ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు. కుటుంబాల్లో కూడా ఈ అంశంపై చర్చలు జరగాలని, పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, ఏ అలవాట్లకు లోనవుతున్నారు అన్న విషయాలను తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈజీ మనీ, తక్షణ ఆనందం అనే భావనతో కొంతమంది గాంజా వ్యాపారంలోకి వస్తుండగా, యువత కూడా మత్తుకు బానిసవుతున్నారని నాగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. గాంజా వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో గాంజాకు బానిసైన కుమారుడిని తండ్రే హత్య చేసిన ఘటన దీనికి ఉదాహరణ అని చెప్పారు.

ప్రజలు తప్పు జరుగుతున్నప్పుడు మౌనం వీడి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తమ ప్రాంతాల్లో గాంజా విక్రయాలు, డ్రగ్స్ చలామణి జరుగుతున్నట్లయితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అయితే సమాచారం ఇచ్చిన వారి వివరాలను బహిరంగంగా ప్రకటించడం వల్ల వారికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, అందుకే గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.

సమాజంలో ప్రతి వ్యక్తి బాధ్యత తీసుకున్నప్పుడే గాంజా వంటి మత్తు పదార్థాల నియంత్రణ సాధ్యమవుతుందని నాగరాజు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *