ముష్కి చెరువు ఆక్రమణలపై హైడ్రా యాక్షన్.. 10 రోజుల్లో గుడిసెలు తొలగించాలని ఆదేశాలు

హైదరాబాద్ నర్సింగ్ పరిధిలోని ముష్కి చెరువు వద్ద హైడ్రా అధికారులు, ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. చెరువు పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన గుడిసెలు, డంపింగ్ కార్యకలాపాలు, బఫర్ జోన్ ఆక్రమణలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు అభివృద్ధి, నీటి నిల్వ సామర్థ్య పరిరక్షణ కోసం చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.

అధికారుల వివరాల ప్రకారం ముష్కి చెరువు మొత్తం 52 ఎకరాల ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో ఉంది. ఇందులో సుమారు 16 నుంచి 18 ఎకరాల వరకు చెరువు వాటర్ స్ప్రెడ్ ఏరియాగా గుర్తించారు. అయితే కొందరు వ్యక్తులు ఈ పరిధిలో గుడిసెలు ఏర్పాటు చేసి, డంపింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ చెరువుకు నష్టం కలిగిస్తున్నారని అధికారులు తెలిపారు.

చెరువు చుట్టూ కొందరు కార్మికులను ఉంచి కమర్షియల్ కార్యకలాపాలకు సిద్ధమవుతున్నారని, ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను డంప్ చేయడం వల్ల చెరువు నీరు కాలుష్యానికి గురవుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే ఎఫ్టీఎల్ మార్కింగ్ పూర్తయిందని, బఫర్ జోన్ వరకు కూడా ఆక్రమణలు జరిగాయని అధికారులు వెల్లడించారు.

హైడ్రా అధికారులు మాట్లాడుతూ గత మూడు నెలలుగా ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నామని, ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చామని తెలిపారు. గుడిసెల్లో నివసిస్తున్న కార్మికులకు, భూ యజమానులకు కూడా ముందుగానే సమాచారం ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు చివరిసారిగా 10 రోజుల గడువు ఇస్తున్నామని, ఆలోపు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సూచించారు.

“మేము నేరుగా కూల్చివేతలకు వస్తే పేదలపై చర్యలు తీసుకున్నారనే విమర్శలు వస్తాయి. అందుకే ముందుగా అవగాహన కల్పిస్తూ, సమయం ఇస్తున్నాం. చెరువును రక్షించడం ప్రభుత్వ బాధ్యత” అని అధికారులు స్పష్టం చేశారు.

ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ చెరువు పరిధిలో వ్యవసాయం చేసుకోవడంపై ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ చెరువు భూమిలో శాశ్వత నిర్మాణాలు, గుడిసెలు, కమర్షియల్ యాక్టివిటీలు అనుమతించబోమన్నారు. బఫర్ జోన్‌లో ఎలాంటి నిర్మాణాలు చేయరాదని హెచ్చరించారు.

స్థానిక కార్మికులు మాత్రం తాము ఉపాధి కోసం ఇక్కడికి వచ్చామని, ఒక్కసారిగా వెళ్లిపోవడం కష్టమని తెలిపారు. అయితే అధికారులు “ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఉండటం చట్టవిరుద్ధం” అని స్పష్టం చేస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని కోరారు.

చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా డంపింగ్ జోన్ల తొలగింపు, నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణ, బఫర్ జోన్ క్లియరెన్స్ వంటి చర్యలు త్వరలోనే చేపట్టనున్నట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో చెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని కాపాడేందుకు ఈ చర్యలు అవసరమని అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *