దేశవ్యాప్తంగా నేడు మెడికల్ షాపులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఔషధ రంగంలో పెద్ద చర్చ మొదలైంది. ఆన్లైన్ ఫార్మసీలు, ఇన్‌స్టంట్ మెడిసిన్ డెలివరీ యాప్‌లకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తోంది. దేశంలో సుమారు 12.4 లక్షల మంది కెమిస్టులు, ఫార్మసిస్టులు, డ్రగ్ డిస్ట్రిబ్యూటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సంఘం ఆన్లైన్ మెడిసిన్ ప్లాట్‌ఫాంలపై కఠిన నియంత్రణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
కోవిడ్ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఇంటికే మందులు అందించేందుకు తాత్కాలికంగా ఆన్లైన్ డెలివరీ విధానాన్ని అనుమతించారు. అయితే ఇప్పుడు అదే వ్యవస్థను కార్పొరేట్ కంపెనీలు భారీ వ్యాపారాల కోసం ఉపయోగిస్తున్నాయని కెమిస్టుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద డిస్కౌంట్లు, ఫాస్ట్ డెలివరీలతో ఆన్లైన్ ఫార్మసీలు మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమిస్తున్నాయని చెబుతున్నారు.
గల్లీల్లో ఉండే చిన్న చిన్న మెడికల్ షాపులు డైలీ అమ్మకాలపైనే ఆధారపడుతుంటాయి. సాధారణ జలుబు, జ్వరం, నొప్పి మందులు, బేసిక్ టాబ్లెట్లు వంటి వాటి అమ్మకాల ద్వారానే చాలామంది చిన్న వ్యాపారులు జీవనం సాగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆన్లైన్ యాప్‌ల ద్వారా ఇంటికే మందులు వస్తుండటంతో స్థానిక మెడికల్ షాపుల వ్యాపారం 90 శాతం వరకు పడిపోయిందని కెమిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా సరైన చట్టపరమైన నియంత్రణలు లేకుండా ఆన్లైన్ ఫార్మసీలు పనిచేస్తున్నాయని, నకిలీ ప్రిస్క్రిప్షన్లతో కూడా మందులు సరఫరా అవుతున్నాయని సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇది రోగుల భద్రతకు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. తాము ఆన్లైన్ ఫార్మసీలకు పూర్తిగా వ్యతిరేకం కాదని, కానీ సాధారణ మెడికల్ షాపులకు వర్తించే కఠిన నిబంధనలే ఆన్లైన్ ప్లాట్‌ఫాంలకూ వర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు వినతిపత్రం సమర్పించినట్లు కెమిస్టుల సంఘం తెలిపింది. ప్రభుత్వం తమ సమస్యలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు.
నేటి సమ్మె కారణంగా మందుల లభ్యతపై కొంత ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా షుగర్, బీపీ, గుండె సంబంధిత సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ముందుగానే అవసరమైన మందులను తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇక మరోవైపు కొన్ని పెద్ద కార్పొరేట్ ఫార్మసీ చైన్లు, హాస్పిటల్ ఆధారిత మెడికల్ స్టోర్లు సమ్మెలో పాల్గొంటాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. దీంతో చిన్న మెడికల్ షాపులు బంద్ అయినా, పెద్ద కార్పొరేట్ ఫార్మసీలకు ఇదే అవకాశంగా మారే పరిస్థితి కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

