జూన్ 2 టార్గెట్ అంటూ కొత్త హామీలు.. కానీ పాత గ్యారెంటీల పరిస్థితి ఏంటి?

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2ను లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటనలు చేస్తోంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా కొత్త దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, రెండు లక్షల కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్‌లెస్ చికిత్స వంటి పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో వీటి విధి విధానాలను ఖరారు చేయనున్నట్లు చెబుతున్నారు.

ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు “ఇందిరమ్మ కుటుంబ భీమా” పథకం అమలు చేయాలని నిర్ణయించింది. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనున్నట్లు చెబుతున్నారు. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లు కేటాయించినట్లు సమాచారం. జూన్ 2న ఎల్ఐసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకునే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

అదే రోజు చేయూత పథకం కింద కొత్తగా రెండు లక్షల మంది లబ్ధిదారులకు వృద్ధాప్య, వితంతు, ఇతర పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పెన్షన్లు రూ.2016, దివ్యాంగులకు రూ.4016 చొప్పున అందుతున్నాయి. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వృద్ధాప్య పెన్షన్‌ను రూ.4000కి, దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6000కి పెంచుతామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రజల్లో కూడా ఇదే చర్చ నడుస్తోంది. “ఫేజ్-1 అమలైంది” అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అసలు ఏ హామీలు పూర్తిగా అమలయ్యాయో స్పష్టత లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొత్త పెన్షన్లు ఇవ్వడం ఒక్కటే గ్యారెంటీ అమలయినట్టా? అసలు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మొత్తాలు పెంచకపోతే అది పూర్తి అమలు ఎలా అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇక ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. పేదలకు ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్న సమయంలోనే కొందరు స్థానిక నాయకులు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇల్లు మంజూరు చేయిస్తానని చెప్పి ఓ మహిళను వేధించాడన్న ఆరోపణలపై ఓ కాంగ్రెస్ నాయకుడిపై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది.

బాధితురాలి ఆరోపణల ప్రకారం, గతంలో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కోసం ఆమె పేరు జాబితాలో ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత కోరికలకు లొంగలేదనే కారణంతో స్థానిక నాయకుడు ఆ జాబితా నుంచి పేరు తొలగించేలా చేశాడట. “నా కోరిక తీరిస్తేనే ఇల్లు వస్తుంది” అంటూ మానసికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించింది. చివరకు రాజంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూ, న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పేదల కోసం అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు కొందరు స్థానిక నాయకుల చేతుల్లో అవినీతి, దుర్వినియోగానికి గురవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. గతంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సమయంలో కూడా డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని ప్రజలు గుర్తుచేస్తున్నారు.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, సంక్షేమ పథకాల ప్రకటనల కంటే వాటి అమలు పారదర్శకంగా ఉండటం ముఖ్యమని చెబుతున్నారు. నిజంగా అర్హులైన వారికి పథకాలు చేరకపోతే ప్రభుత్వానికి ప్రజల్లో నమ్మకం తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. స్థానిక స్థాయిలో జరిగే అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే మొత్తం ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *