తెలంగాణలో తాజాగా నియమితులైన కార్పొరేషన్ చైర్మన్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతలు అప్పగించబడిన కొందరు చైర్మన్లు ఇప్పుడు అధికార దర్భం ప్రదర్శించడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంచి ఆఫీసులు కావాలి.. ఇద్దరు గన్మెన్లు కావాలి.. ప్రభుత్వ వాహనాలు కావాలి.. మంచి జీతం కావాలి అంటూ మంత్రుల చుట్టూ లాబీయింగ్ చేస్తున్నారనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. వాటిలో చాలా వరకు కొత్త కార్పొరేషన్లే కావడంతో ఆయా కార్యాలయాలను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొన్ని కార్యాలయాలను బిఆర్కే భవన్‌లో, మరికొన్నిటిని సంక్షేమ భవన్‌లో ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అయితే చైర్మన్లలో చాలామంది మాత్రం బిఆర్కే భవన్‌లోనే తమకు కార్యాలయాలు కేటాయించాలని ఒత్తిడి తెస్తున్నారట. కారణం ఏమిటంటే సెక్రటేరియట్ దగ్గరగా ఉండటం వల్ల మంత్రులను, ఉన్నతాధికారులను కలవడానికి సులభంగా ఉంటుందనే ఆలోచన.
అయితే అసలు వివాదం అక్కడితో ఆగలేదు. కొందరు చైర్మన్లు తమకు ఇద్దరు గన్మెన్లు కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తున్నారట. గన్మెన్లు ఉంటే ప్రజల్లో తమకు హోదా పెరుగుతుందని, కార్యకర్తలు కలవడానికి వచ్చినప్పుడు హుందాగా కనిపిస్తామని భావిస్తున్నారట. మరికొందరు అయితే ప్రభుత్వ వాహనాలు కూడా ఇవ్వాలని కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఇది చూసిన ప్రజలు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలకే ఒక్క గన్మెన్ మాత్రమే ఉండే పరిస్థితుల్లో కార్పొరేషన్ చైర్మన్లకు ఇద్దరు గన్మెన్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రులు సైతం ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ కొత్త హంగామా ఎందుకని సోషల్ మీడియాలో కూడా సెటైర్లు పడుతున్నాయి.
ప్రజల పన్నుల డబ్బుతోనే ప్రభుత్వ వాహనాలు, ఇంధనం, భద్రతా సిబ్బంది, కార్యాలయాల నిర్వహణ జరుగుతుందని గుర్తుచేస్తూ, సేవ చేయాల్సిన స్థానాల్లో ఉన్నవారు అధికార ఆర్భాటం కోసం పోటీ పడటం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఇచ్చారా? లేక రాజకీయ హంగామా కోసం ఇచ్చారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇక మహిళా కమిషన్ చైర్మన్ నియామకాలపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరికి హోదాకు తగ్గ పదవులు ఇవ్వకుండా కేవలం నామమాత్రపు బాధ్యతలు అప్పగించారని అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉద్యమకారుల కుటుంబాలకు సరైన గౌరవం దక్కలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చ జరుగుతున్న సమయంలో కొత్తగా జీతాలు, వాహనాలు, గన్మెన్లు, లగ్జరీ ఆఫీసుల కోసం ఒత్తిడి తెచ్చే ధోరణి ప్రజల్లో అసహనం పెంచుతోంది. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులపై దృష్టి పెట్టకుండా, హోదా ప్రదర్శనలపై ఆసక్తి చూపడం రాజకీయ వ్యవస్థపై మరింత విమర్శలకు దారితీస్తోంది.
ప్రస్తుతం ప్రభుత్వం చైర్మన్లకు ఎంత జీతం ఇవ్వాలనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే కనీసం లక్ష రూపాయల వరకు జీతం ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. కొందరు చైర్మన్లు “జీతం లేకపోయినా పర్లేదు.. గన్మెన్లు మాత్రం ఉండాలి” అని కోరుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ప్రజలు మాత్రం ఒకటే ప్రశ్న అడుగుతున్నారు — “పదవులు సేవ కోసం తీసుకున్నారా? లేక అధికార ప్రదర్శన కోసం తీసుకున్నారా?”

