రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో భారీ అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ నిర్మాణ పనుల్లో కీలక బాధ్యతలు నిర్వహించే ఆర్అండ్బీ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ జే. మోహన్ నాయక్ నివాసాలు, కార్యాలయాలు, బంధువులు, బినామీలు, అనుచరుల ఇళ్లపై ఏసీబీ అధికారులు నిర్వహించిన మెరుపు దాడుల్లో కళ్లు చెదిరే అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి.
ప్రభుత్వ రహదారులు, వంతెనలు, ఫ్లైఓవర్లు, భవనాల నిర్మాణాలకు సంబంధించిన భారీ టెండర్లు ఈ శాఖ పరిధిలోనే జరుగుతుంటాయి. ప్రజాధనం వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ శాఖలో పనిచేసే అత్యున్నత స్థాయి అధికారి వద్ద ఇంత భారీ స్థాయిలో ఆస్తులు బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై మంగళవారం ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 17 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని నివాసంతో పాటు బంధువులు, బినామీలు, అనుచరుల ఇళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో భారీగా నగదు, బంగారం, వెండి, స్థిరాస్తుల పత్రాలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీల్లో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ముల్లంగి గ్రామంలో సుమారు 19.38 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. దీని విలువ అధికారిక లెక్కల ప్రకారం రూ.82.89 లక్షలుగా నమోదైంది.
హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రాంతాల్లో భారీ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. గచ్చిబౌలి ప్రాంతంలో నాలుగు, కొంపల్లిలో మూడు ఫ్లాట్లు కలిపి మొత్తం ఏడు ఫ్లాట్లను అధికారులు గుర్తించారు. వీటి డాక్యుమెంట్ విలువ రూ.7.34 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్ విలువ వంద కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
అలాగే మియాపూర్‌లో రూ.2.50 కోట్ల విలువైన విల్లా, కూకట్‌పల్లిలో రూ.62.14 లక్షల విలువైన నూతన గృహాన్ని గుర్తించారు. నిజామాబాద్‌లో మరో విల్లా కొనుగోలు కోసం ఇచ్చిన రూ.కోటి అడ్వాన్స్‌కు సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇక నగదు, బంగారం స్వాధీనం వివరాలు మరింత సంచలనం సృష్టిస్తున్నాయి. ఏకంగా రూ.55 లక్షల నగదు ఇంటి నుంచే లభ్యమైంది. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.1.44 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇంట్లో సుమారు రూ.2 కోట్ల విలువ చేసే రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు, రూ.3.60 లక్షల విలువైన ఆరు కిలోల వెండి వస్తువులు లభ్యమయ్యాయి. గృహోపకరణాలు, ఫర్నిచర్ విలువ సుమారు రూ.1.26 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఇవే కాకుండా రూ.11.25 లక్షల విలువైన తొమ్మిది మొబైల్ ఫోన్లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, రూ.25 లక్షల విలువైన రెండు వాహనాలను కూడా ఏసీబీ గుర్తించింది.
ఏసీబీ అధికారిక ప్రకటన ప్రకారం ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల డాక్యుమెంట్ విలువే రూ.17.94 కోట్లు. అయితే బహిరంగ మార్కెట్ విలువ వందల కోట్ల రూపాయల్లో ఉండే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని అక్రమాస్తులు బయటపడే అవకాశముందని వెల్లడించారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జే. మోహన్ నాయక్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు, ఆయనను హైదరాబాద్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
ప్రజల పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరిన నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల్లో అవినీతి చోటుచేసుకుంటే నష్టపోయేది సామాన్య ప్రజలేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రోడ్లు, వంతెనలు, ప్రభుత్వ భవనాల నాణ్యతపై కూడా ఇటువంటి ఘటనలు అనుమానాలకు తావిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.
లక్షల్లో జీతం పొందే అత్యున్నత స్థాయి అధికారి వద్ద వందల కోట్ల విలువైన ఆస్తులు బయటపడటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసు దర్యాప్తు ఎటువైపు మలుపు తిరుగుతుందో, మరెవరెవరి పేర్లు వెలుగులోకి వస్తాయో చూడాల్సి ఉంది.

