నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ.
రాష్ట్రంలో అడ్మిషన్ల సీజన్ మొదలైతే చాలు… విద్యార్థులు, తల్లిదండ్రుల ఫోన్లు ఆగకుండా మోగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. టెన్త్, ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయంటే చాలు… కార్పొరేట్ స్కూల్లు, ప్రైవేట్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలు అడ్మిషన్ల పేరుతో పేరెంట్స్‌ను టార్గెట్ చేస్తున్నాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల వ్యక్తిగత వివరాలను డబ్బుల కోసం అమ్ముకుంటున్నారనే అంశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఊరు, చదివిన స్కూల్, పేరెంట్స్ ఉద్యోగ వివరాలు వంటి సమాచారాన్ని కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రైవేట్ కాలేజీలు, కన్సల్టెన్సీలకు విక్రయిస్తున్నాయట. టెన్త్ పూర్తయిన విద్యార్థుల డేటాను జూనియర్ కాలేజీలకు, ఇంటర్ పూర్తయిన వారి వివరాలను ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలకు చేరవేస్తున్నారని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ ప్రధానంగా లేవనెత్తుతున్న ప్రశ్న ఏమిటంటే… తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత డేటాను ఎవరు అమ్ముతున్నారు? ఒక విద్యార్థి ఏ స్కూల్లో చదివాడు, అతని ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్, పేరెంట్స్ వివరాలు బయటికి ఎలా వెళ్తున్నాయి? ఈ సమాచారాన్ని డబ్బుల కోసం విక్రయించడం ఎంతవరకు చట్టబద్ధం అన్నది ఇప్పుడు చర్చకు వస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక కార్పొరేట్ స్కూల్లు, కాలేజీలు విద్యార్థుల డేటాను ఒక వ్యాపారంగా మార్చుకున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఒక్కో విద్యార్థి సమాచారాన్ని బల్క్ రేట్లలో విక్రయిస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారట. ముఖ్యంగా అడ్మిషన్ల సమయంలో ఈ డేటాకు భారీ డిమాండ్ ఉంటుందని సమాచారం.
ఇక పరిస్థితి ఎలా ఉందంటే… ఉదయం నుంచి రాత్రి వరకు పేరెంట్స్‌కు ఫోన్లు వస్తూనే ఉన్నాయట. “మీ అబ్బాయి ఇంటర్ పూర్తి చేశాడు కదా మా కాలేజీలో జాయిన్ చేయండి”, “ఇప్పుడే అడ్మిషన్ తీసుకుంటే 50 శాతం స్కాలర్‌షిప్ ఇస్తాం”, “సీట్లు ఫాస్ట్ ఫిల్లవుతున్నాయి” అంటూ వరుస కాల్స్‌తో పేరెంట్స్ విసిగిపోతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఫోన్ల ద్వారా అడ్మిషన్ల వేట కొనసాగిస్తున్నాయట.
కొంతమంది పేరెంట్స్ చెబుతున్నదేమిటంటే… రోజుకు 20 నుంచి 50 కాల్స్ వస్తున్నాయట. ఆఫీస్ పనుల్లో ఉన్నా, డ్రైవింగ్‌లో ఉన్నా, వ్యక్తిగత పనుల్లో ఉన్నా నిరంతరం ఫోన్లు వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… “మా వివరాలు మీకు ఎలా తెలిసాయి?” అని అడిగితే కొందరు కాల్ కట్ చేస్తున్నారట. మరికొందరు మాత్రం నేరుగా “మీ పిల్లలు చదివిన కాలేజీ నుంచే డేటా తీసుకున్నాం” అని చెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకొందరు “ఫ్రెండ్స్ ద్వారా వివరాలు వచ్చాయి” అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారట.
విద్య అనే పవిత్ర వ్యవస్థను పూర్తిగా వ్యాపారంగా మార్చేశారని సామాన్యులు మండిపడుతున్నారు. ఒకప్పుడు విద్య అంటే సేవ భావన ఉండేదని, ఇప్పుడు మాత్రం ఫీజులు, కమిషన్లు, అడ్మిషన్లు, డేటా అమ్మకాలు అన్నీ కలిసి పెద్ద దందాగా మారిపోయాయని విమర్శిస్తున్నారు.
ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే… ఈ వ్యవహారంలో కొన్ని ప్రభుత్వ స్కూల్లు, కాలేజీల పేర్లు కూడా వినిపిస్తున్నాయట. అంటే ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ రంగంలోనూ డేటా భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవసీ హక్కును పూర్తిగా ఉల్లంఘిస్తున్న ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల డేటా లీక్ చేస్తున్న విద్యాసంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాధ్యులపై ఎఫ్ఐఆర్‌లు పెట్టాలని కోరుతున్నారు. డేటా ప్రొటెక్షన్‌కు సంబంధించి కఠిన చట్టాలు తీసుకురావాలని, విద్యార్థుల సమాచారాన్ని వ్యాపారంగా మార్చే సంస్థల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలే ఇప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని డబ్బుల కోసం అమ్ముకుంటే… ఇక ప్రైవసీకి, నమ్మకానికి విలువ ఎక్కడ మిగులుతుందన్న ప్రశ్న తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

