తెలంగాణలో మందుబాబులకు భారీ షాక్.. జూన్ 2 తర్వాత మద్యం, బీర్ ధరలు 15% వరకు పెంపు?

తెలంగాణలోని మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోందనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే ఎండాకాలం కారణంగా బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో కొనసాగుతుండగా, మరోవైపు ప్రభుత్వం అన్ని రకాల మద్యం, బీర్ల ధరలను 10 నుంచి 15 శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ముగిసిన వెంటనే ధరల పెంపుపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

సమాచారం ప్రకారం సాధారణ బ్రాండ్లపై సుమారు 10 శాతం వరకు, ప్రీమియం బ్రాండ్లపై 12 నుంచి 15 శాతం వరకు ధరలు పెరగవచ్చని తెలుస్తోంది. బీర్ల ధరలు కూడా 10 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పెంపు అమల్లోకి వస్తే సాధారణ క్వార్టర్ బాటిల్‌పై కనీసం రూ.20 వరకు, ప్రీమియం లీటర్ బాటిళ్లపై రూ.100 వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఈ ధరల పెంపు వెనుక ప్రధాన కారణాల్లో ప్రభుత్వ ఆదాయం ఒకటైతే, మద్యం తయారీ కంపెనీల ఒత్తిడి కూడా మరో ముఖ్య కారణంగా చెబుతున్నారు. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరగడం, కమర్షియల్ గ్యాస్ ధరలు అధికమవడం వల్ల గ్లాస్ బాటిళ్ల తయారీ ఖర్చులు భారీగా పెరిగినట్లు సమాచారం. అదేవిధంగా స్పిరిట్ రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్ మెటీరియల్ ధరలు కూడా పెరగడంతో పాత ధరలకే సరఫరా చేయడం వల్ల నష్టాలు వస్తున్నాయని డిస్టిలరీలు, బ్రీవరీ కంపెనీలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మద్యం ధరలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం ధరలు, పన్ను విధానాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కొన్ని బ్రాండ్లు పొరుగు రాష్ట్రాల కంటే తక్కువ ధరలకు లభిస్తున్నాయని కమిటీ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

కమిటీ నివేదిక ప్రకారం 25 నుంచి 30 శాతం వరకు ధరలు పెంచే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజా వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రస్తుతం 10 నుంచి 15 శాతం వరకు మాత్రమే పెంపు చేయాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పెంపు ద్వారా రాష్ట్ర ఖజానాకు ప్రతి నెల వందల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్ర బడ్జెట్‌లో ఎక్సైజ్ శాఖ ఆదాయం కీలక పాత్ర పోషిస్తుండగా, ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల సమీకరణ కోసం కూడా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే మరోవైపు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ బిల్లులు, ఇతర ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులపై ఈ ధరల పెంపు మరింత భారం మోపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా “ప్రభుత్వానికి డబ్బు అవసరమైతే ప్రతి సారి ప్రజలపైనే భారం ఎందుకు?” అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయకపోయినా, జూన్ 2 తర్వాత తెలంగాణలో మద్యం ధరల పెంపు దాదాపు ఖాయమనే ప్రచారం బలంగా సాగుతోంది. అధికారిక నిర్ణయం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *