తెలంగాణలో మందుబాబులకు మరో భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో లిక్కర్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ నెలలోనే కొత్త ధరలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది.
లిక్కర్ ధరల సవరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ ప్రస్తుతం డిస్టిలరీ కంపెనీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. పెరిగిన ఉత్పత్తి వ్యయం, ముఖ్యంగా బాటిల్ తయారీ ఖర్చులు, గ్యాస్ ధరల పెరుగుదల, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం నేపథ్యంలో మద్యం ధరలు పెంచాలని కంపెనీలు ఒత్తిడి తెస్తున్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం సాధారణ ఫుల్ బాటిళ్లపై ₹60 వరకు, ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిళ్లపై ₹100 వరకు, కొన్ని హైఎండ్ బ్రాండ్లపై ₹120 వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ పెంపు అమల్లోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా మద్యం ధరలు మరింత భారం కానున్నాయి.
తెలంగాణలో సాధారణంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి లిక్కర్ ధరలను సవరించే ఆనవాయితీ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 మేలో ధరలు పెరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లోనే కంపెనీలు ధరల పెంపు కోసం ఒత్తిడి తెచ్చినా, అప్పట్లో ప్రభుత్వం కొంతకాలం వేచి చూడాలని సూచించినట్టు సమాచారం.
అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, గ్యాస్ ధరల పెరుగుదల, తయారీ వ్యయాల భారంతో కంపెనీలు మళ్లీ ధరల పెంపుపై పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా మద్యం బాటిళ్ల తయారీ ఖర్చు భారీగా పెరిగిందని డిస్టిలర్లు ప్రభుత్వానికి వివరించినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ధరల పెంపుతో ప్రభుత్వానికి కూడా భారీ ఆదాయం వచ్చే అవకాశముంది. ప్రతి నెల అదనంగా సుమారు ₹250 కోట్ల వరకు, ఏడాదికి దాదాపు ₹3000 కోట్ల అదనపు ఆదాయం సమకూరేలా ధరల నిర్మాణంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే ఒకేసారి భారీగా ధరలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత రావచ్చని అధికారులు భావిస్తున్నారు. అదే సమయంలో అధిక ధరల కారణంగా గుడుంబా తయారీ పెరిగే ప్రమాదం కూడా ఉందని ఎక్సైజ్ శాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, కంపెనీలకు లాభం ఉండేలా, ప్రజలపై వ్యతిరేకత తక్కువగా ఉండేలా మధ్యస్థాయి ధరల పెంపు దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
వచ్చే వారం కమిటీ తొలి సమావేశం జరగనుండగా, ఆ సమావేశంలో కంపెనీల ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఆ తర్వాతే కొత్త ధరలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

