సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్, వీడియో కాల్స్ పెరిగిన ఈ డిజిటల్ యుగంలో మరో ప్రమాదకరమైన సైబర్ నేరం వేగంగా విస్తరిస్తోంది. అదే “హనీ ట్రాప్”. అందమైన అమ్మాయి ఫోటోతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, తీయని మాటలతో యువతను మాత్రమే కాదు పెద్ద పెద్ద అధికారులను కూడా ఉచ్చులో పడేస్తున్న ముఠాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా భయాందోళనలు కలిగిస్తున్నాయి.
మొదట ఫ్రెండ్లీ చాటింగ్‌తో మొదలయ్యే ఈ ట్రాప్, తర్వాత వ్యక్తిగత సంబంధాల దాకా తీసుకెళ్తుంది. అవతల మాట్లాడేది నిజంగా అమ్మాయా లేక మరో వ్యక్తా అన్న విషయం కూడా చాలాసార్లు తెలియదు. ప్రేమ, సానుభూతి, ఒంటరితనం వంటి భావోద్వేగాలను టార్గెట్ చేస్తూ నమ్మకం పెంచుకుంటారు. ఆ తర్వాత టెంప్టింగ్ ఫోటోలు, వీడియో కాల్స్‌తో బాధితులను మానసికంగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు.
ఇక ఒకసారి బాధితుడు వారి ఉచ్చులో పడితే డబ్బులు, వ్యక్తిగత సమాచారం లేదా ఇతర వివరాలు డిమాండ్ చేయడం మొదలవుతుంది. ఒకవేళ వారు అడిగినవి ఇవ్వకపోతే బాధితుల ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. కొంతమందిని నేరుగా బ్లాక్‌మెయిల్ చేస్తూ లక్షల రూపాయలు దోచుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
ఈ హనీ ట్రాప్ కేవలం యువతకే పరిమితం కాలేదు. ఉద్యోగ విరమణ చేసిన అధికారులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, పెద్ద స్థాయి వ్యక్తులు కూడా ఈ మోసాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. చాలామంది పరువు పోతుందనే భయంతో బయటకు చెప్పుకోలేక మౌనంగా డబ్బులు చెల్లిస్తున్న పరిస్థితులు ఉన్నాయి.
ఇటీవల డిజిటల్ అరెస్టులు, ఫేక్ కాల్స్, సైబర్ మోసాలకు సంబంధించిన కేసులు బయటపడుతున్నప్పటికీ హనీ ట్రాప్ వ్యవహారాల్లో మాత్రం ఇంకా కఠిన చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డేటింగ్ యాప్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొన్ని యాప్స్‌లో చిన్న మొత్తంలో సభ్యత్వం తీసుకుంటే చాలని ప్రకటనలు ఇస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఆ యాప్స్‌లో లాగిన్ అయిన వెంటనే ఫేక్ అకౌంట్లు సంప్రదించి చాటింగ్ మొదలుపెడుతున్నాయి. కొద్దికాలానికే వ్యక్తిగత ఫోటోలు, కుటుంబ వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించి వాటినే ఆయుధాలుగా మార్చి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.
కొన్ని యాప్స్‌లో చిన్న మొత్తంలో సభ్యత్వం తీసుకుంటే చాలని ప్రకటనలు ఇస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఆ యాప్స్‌లో లాగిన్ అయిన వెంటనే ఫేక్ అకౌంట్లు సంప్రదించి చాటింగ్ మొదలుపెడుతున్నాయి. కొద్దికాలానికే వ్యక్తిగత ఫోటోలు, కుటుంబ వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించి వాటినే ఆయుధాలుగా మార్చి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.
సైబర్ నిపుణుల ప్రకారం, తెలియని వ్యక్తులతో వీడియో కాల్స్ చేయడం, వ్యక్తిగత ఫోటోలు షేర్ చేయడం, అనుమానాస్పద యాప్స్ డౌన్లోడ్ చేయడం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా ఫేక్ లింకులు, స్క్రీన్ రికార్డింగ్ యాప్స్ ద్వారా ఫోన్‌లోని డేటా మొత్తం హ్యాక్ చేసే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.
అందుకే సోషల్ మీడియాలో లేదా డేటింగ్ యాప్స్‌లో పరిచయమయ్యే వ్యక్తుల విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. ఎలాంటి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేస్తే భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
డిజిటల్ ప్రపంచంలో ఒక చిన్న నిర్లక్ష్యం జీవితాంతం ఇబ్బందులు తెచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

