కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి Revanth Reddyపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వరంగల్‌లో నిర్వహించిన రైతు సమగ్ర సంగ్రామ సదస్సులో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీని కరోనా వైరస్ కంటే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.కేటీఆర్ మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యూవల్ సీఎం. ప్రతి నెల ఢిల్లీకి కప్పం కట్టి తన కుర్చీని కాపాడుకుంటున్నారు” అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలు ఇప్పుడు అమలు కావడం లేదని మండిపడ్డారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు 34 హామీలు ఇచ్చిందని, గ్యారెంటీ కార్డులు, బాండ్ పేపర్లు అంటూ ప్రజలను నమ్మించి ఓట్లు దక్కించుకుందని ఆరోపించారు. ఢిల్లీ నుంచి Rahul Gandhi, గల్లీ నుంచి రేవంత్ రెడ్డి వచ్చి రైతులను మోసం చేశారని విమర్శించారు.

వరంగల్ రైతు డిక్లరేషన్ ఇప్పుడు చిత్తు కాగితంతో సమానమైందని కేటీఆర్ అన్నారు. నాలుగేళ్లు పూర్తవుతున్నా రైతులకు ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు కాలేదని ఆరోపించారు. ముఖ్యంగా రైతు భరోసా, ధాన్యం కొనుగోలు, గిట్టుబాటు ధర అంశాల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతులు పండించిన వడ్లు కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయి ఉన్నాయని, సరైన గిట్టుబాటు ధర అందడం లేదని చెప్పారు.ప్రభుత్వం “తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం” అని ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని విమర్శించారు. వర్షాల కారణంగా ధాన్యం తడవడంతో రైతులు మరింత నష్టపోతున్నారని, అయినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు

ఇక మేడిగడ్డ ప్రాజెక్టుపై కూడా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “మేడిగడ్డ ప్రాజెక్టును బాంబులు పెట్టి పేల్చేశారు. చెక్‌డ్యాంలను కూడా ధ్వంసం చేశారు” అంటూ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.రైతుల సమస్యలపై అధికార పార్టీ సీరియస్‌గా స్పందించడం లేదని, రైతు సంక్షేమం పూర్తిగా గాలికొదిలేసిందని కేటీఆర్ విమర్శించారు. రైతులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య విమర్శల యుద్ధం మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *