తెలంగాణలో మక్క రైతుల ఆవేదన రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది. పంట చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు, మార్కెట్ యార్డుల్లో నిల్వ సమస్యలు, లారీల కొరత, కొనుగోలు ఆలస్యం కారణంగా తమ పరిస్థితి దయనీయంగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు.
“ట్రాక్టర్లు దొరకడం లేదు.. లారీలు రావడం లేదు.. బస్తాలు మోసుకుంటూ తిరగడమే మా పని అయిపోయింది” అంటూ రైతులు మండిపడ్డారు. పంటను మార్కెట్కు తీసుకెళ్లినా రోజుల తరబడి లైన్లలోనే ఉంచుతున్నారని, వర్షం పడితే మొత్తం తడిసి నష్టపోతున్నామని చెబుతున్నారు.
ఒక రైతు మాట్లాడుతూ, “13 రోజులు అయింది ఆన్లైన్ చేసి. డబ్బులు కూడా కట్టాం. కానీ ఇప్పటికీ కొనుగోలు లేదు. వర్షాలు పడితే మా మక్క మొత్తం పాడవుతోంది. ట్రాక్టర్లు తిరగలేని పరిస్థితి. రోడ్లు బురదమయమయ్యాయి” అని వాపోయాడు.
ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రైతులు ఎన్నికల హామీలను గుర్తు చేస్తున్నారు. “రైతుని రాజు చేస్తా అన్నారు. రుణమాఫీ చేస్తా అన్నారు. ఆడవాళ్లకు బంగారం ఇస్తా అన్నారు. కానీ ఇప్పుడు మక్కల బంగారం మాకే భారమైంది” అని విమర్శించారు.
మరో రైతు మాట్లాడుతూ, “ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం లారీలు పంపించి ధాన్యం కొనేవారు. ట్రాక్టర్ కిరాయి కూడా ఇచ్చేవారు. ఇప్పుడు రైతు పరిస్థితి ఎవరూ పట్టించుకోవడం లేదు” అని వ్యాఖ్యానించాడు. కరోనా సమయంలో కూడా రైతులకు సహాయం అందిందని, ఇప్పుడు మాత్రం పరిస్థితి మరింత దారుణంగా మారిందని పేర్కొన్నాడు.
కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడం, బస్తాల కొరత, గోదాముల సమస్యలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. మార్కెట్ యార్డుల్లో రాత్రింబవళ్లు పంట కాపలా కాస్తూ రైతులు పడుతున్న ఇబ్బందులు కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.
“మళ్లీ ఓటు వేస్తారా?” అని అడిగితే కొందరు రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “ఇంకా మాకు సిగ్గు ఉండాలి. మళ్లీ మోసపోవద్దు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం పేరుతో మీటింగులు పెడుతున్నా, నేలమీద మాత్రం పరిస్థితి మారలేదని అన్నారు.
వర్షాల కారణంగా ఇప్పటికే పంట నాణ్యత దెబ్బతింటోందని, వెంటనే ప్రభుత్వం కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు ఉపశమనం కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

