రైతుల సంక్షేమమే లక్ష్యం.. రాజకీయాల కోసం రైతుల చావులపై రాజకీయం చేయొద్దు

రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ ప్రభావాలు, హమాలీల కొరత వంటి సమస్యలు ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. 45 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఇప్పటికే ధాన్యం సేకరించామని, మిగిలిన 20 శాతం కూడా ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని తెలిపింది.

గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన నేతలు, ఇప్పుడు రైతుల బాధలను రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. “వర్షం వస్తే, వడగళ్ల వాన పడితే రైతులకు అండగా నిలబడాల్సింది పోయి, సెల్ఫీలు దిగుతున్నారు. రైతు చనిపోతే కుటుంబానికి ఆర్థిక సాయం చేయకుండా పూలమాలలు వేసి ఫోటోలు దిగుతున్నారు” అంటూ మండిపడ్డారు.

గతంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులకు డబ్బులు రావడానికి ఆరు నెలలు పట్టేదని, ఇప్పుడు మాత్రం 72 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. ఈసారి బెంగాల్ ఎన్నికల కారణంగా అక్కడి నుంచి వచ్చే హమాలీలు కొంతమంది తమ రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో కొంత అంతరాయం ఏర్పడిందని చెప్పారు. అయినప్పటికీ కలెక్టర్లు, మంత్రులను క్షేత్రస్థాయికి పంపించి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇక బండి భగీరథ్ కేసు విషయంలో కూడా ప్రభుత్వం స్పందించింది. “పోలీసులు చెప్పిందే నిజమా? లేక రాజకీయ నాయకులు చెప్పిందే నిజమా?” అని ప్రశ్నిస్తూ, పోలీసులు రోడ్డు మధ్యలో తనిఖీల్లో అదుపులోకి తీసుకున్నారని అధికారుల సమాచారం అని చెప్పారు. నిజంగా సరెండర్ చేయాలనుకుంటే ఇంటి నుంచి పిలిచి అప్పగించాల్సిందని అన్నారు.

ఫోక్సో కేసుల విషయంలో ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరిస్తోందని, ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 24 గంటల్లో స్టేట్‌మెంట్లు రికార్డు చేయడం వంటి అన్ని నిబంధనలు పాటిస్తున్నామని తెలిపారు. మైనర్ బాలికకు సంబంధించిన అంశాన్ని రాజకీయాలకు వాడుకోవడం దారుణమని విమర్శించారు.

కేటీఆర్‌పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “తన బావమరిది ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ కేసులో దొరికితే ఎందుకు మాట్లాడలేదు? కోడి పందాలు, డ్రగ్స్ కేసుల్లో తమ పార్టీవాళ్లపై చర్యలు తీసుకోలేదు” అంటూ ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరైనా తప్పు చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఇక ధాన్యం కొనుగోళ్లలో కొంతమంది మిల్లర్లు, ప్రతిపక్ష నేతలు కావాలనే ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఐకేపీ కేంద్రాల నుంచి వచ్చిన లారీలను దించకుండా రోజుల తరబడి నిలిపివేసి కొత్త ధాన్యం రవాణాకు ఆటంకం కలిగిస్తున్నారని, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్‌లా మారిందని వ్యాఖ్యానించారు.

రైతుల సమస్యలను రాజకీయ లాభాల కోసం వాడుకోవద్దని, ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *