అమీర్‌పేట్ హాస్టల్ వివాదం.. బొంతు శ్రీదేవి సంచలన ఆరోపణలు.. ప్రాస్టిట్యూషన్, దాడులపై ఫిర్యాదులు

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ఏషియన్ హాస్టల్ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా ఈ హాస్టల్‌కు సంబంధించిన పలు వీడియోలు, ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాస్టల్‌లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని, కొంతమంది వ్యక్తులు హాస్టల్‌లోకి చొరబడి దాడులు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఇప్పుడు పోలీస్, మహిళా కమిషన్ దృష్టికి చేరింది. ఈ వివాదంపై స్పందించిన బొంతు శ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ హాస్టల్ తమ కుటుంబానికి చెందిన ఆస్తి అని తెలిపారు. మూడు సంవత్సరాల క్రితం కిరాయికి ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి రెంట్ కూడా చెల్లించకుండా వీర హనుమాన్ రెడ్డి, శివపార్వతి అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల మూడు రోజుల క్రితం అమ్మాయిల హాస్టల్‌లో అబ్బాయిలను పంపించి గొడవలు సృష్టించారని, ఆ తరువాత తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

అమ్మాయిల హాస్టల్‌లో అబ్బాయిలు రావడం ఎంత పెద్ద నేరమో అందరికీ తెలుసని, అక్కడ ఉన్న విద్యార్థినులు భయంతో స్థానిక కార్పొరేటర్ సంగీత యాదవ్‌తో పాటు తనను సంప్రదించారని బొంతు శ్రీదేవి తెలిపారు. అఖిల భారత యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలిగా, అలాగే ఆ భవనం తమ సొంత ఇల్లు కావడంతో తాను ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నానని చెప్పారు.

ఇద్దరు కోట్లు ఇచ్చామని వారు చెబుతున్నారని, అయితే దానికి సంబంధించిన చెక్, ప్రామిసరీ నోట్ లేదా ఒప్పంద పత్రాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలపై స్పందిస్తూ.. తమ కుటుంబ సభ్యులపై దాడి జరిగినప్పుడు తాము చూస్తూ ఊరుకోలేక ప్రతిస్పందించామని తెలిపారు.

అంతేకాదు, హాస్టల్‌లో గత తొమ్మిది నెలలుగా ప్రాస్టిట్యూషన్‌కు ప్రోత్సాహం ఇస్తున్నారని కూడా బొంతు శ్రీదేవి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై కొంతమంది అమ్మాయిలు సాక్ష్యాలు చెప్పేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి ముఖాలు బయటకు రానీయకుండా పోలీసులు వీడియో స్టేట్‌మెంట్లు రికార్డ్ చేశారని చెప్పారు. ఈ అంశంపై డిసిపి, సిఐ, మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదులు అందించామని పేర్కొన్నారు.

హాస్టల్‌లో రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు వస్తూ వెళ్లేవారని, ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసేవారని కొంతమంది విద్యార్థినులు చెప్పినట్లు ఆమె వెల్లడించారు. కొందరు అమ్మాయిలను బయటకు తీసుకెళ్లేవారని, ఈ వ్యవహారాలన్నింటిపై సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఘటన జరిగిన రోజు నుంచి సీసీ కెమెరాలు పని చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

ఇంకోవైపు, తమను గుండాలు పెట్టి హాస్టల్‌లోకి రానివ్వడం లేదని మరో వర్గం ఆరోపిస్తున్న విషయంపై స్పందిస్తూ.. నాలుగు రోజులుగా పోలీసులు అక్కడే ఉన్నారని, చట్టం తన పని తాను చేసుకుంటుందని బొంతు శ్రీదేవి తెలిపారు. తాము ఎప్పుడూ చర్చల ద్వారానే సమస్య పరిష్కారం కావాలని ప్రయత్నించామని, కానీ వరుసగా కేసులు పెట్టడంతో ఇప్పుడు చట్టపరంగానే ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

ఇది కేవలం అమీర్‌పేట్ ఏషియన్ హాస్టల్ సమస్య మాత్రమే కాదని, వీర హనుమాన్ రెడ్డి, శివపార్వతి పలుచోట్ల ఇదే విధమైన వివాదాల్లో ఉన్నారని ఆరోపించారు. పంజాగుట్ట, మధురానగర్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్ వంటి పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా వారి మీద ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు.

ఇక హాస్టల్‌లో ఉన్న ఒక యువతి వీడియో కూడా బయటకు రావడం ఈ వ్యవహారాన్ని మరింత హాట్ టాపిక్‌గా మార్చింది. హాస్టల్‌లో తాను చాలా ఇబ్బందులు పడుతున్నానని, రాత్రిళ్లు అనుమానాస్పద వ్యక్తులు వస్తున్నారని ఆ యువతి వీడియోలో ఆరోపించింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం హైదరాబాద్ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, విద్యార్థినుల స్టేట్‌మెంట్లు, హాస్టల్ నిర్వాహకుల వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో నిజానిజాలు ఏమిటి? ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అనే విషయాలు పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *