సెక్రటేరియట్‌లో మామూళ్ల దందా?.. పీఏలు, పీఎస్‌ల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ సెక్రటేరియట్‌లో మరోసారి అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మంత్రుల పేషీల్లో పనిచేస్తున్న పీఏలు, పీఎస్‌లు, ఓఎస్డీల వ్యవహార శైలి ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫైల్ ముందుకు కదలాలంటే మామూల్లు తప్పనిసరి అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. అపాయింట్‌మెంట్ కావాలన్నా, ఫైల్ క్లియర్ కావాలన్నా మధ్యవర్తుల దందా నడుస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. సామాన్య ప్రజలు నేరుగా మంత్రులను కలిసే పరిస్థితి లేకుండా పోయిందని తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

“ప్రజాపాలన”, “ప్రజా ప్రభుత్వం”, “ప్రజాభవన్” అంటూ ప్రభుత్వం చెబుతున్నా.. వాస్తవంగా సామాన్యుడికి న్యాయం జరిగిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక పేదవాడు లేదా మధ్యతరగతి వ్యక్తి తన సమస్యతో సెక్రటేరియట్‌కు వెళ్తే.. పీఏలు, పీఎస్‌లను దాటుకుని మంత్రి వరకు వెళ్లలేని పరిస్థితి ఉందని ఆరోపిస్తున్నారు.

ఫైల్ మూవ్ కావాలంటే కమిషన్లు ఇవ్వాల్సిందే అన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మంత్రులు వ్యక్తిగతంగా మంచివాళ్లైనా.. వారి చుట్టూ ఉన్న వ్యవస్థే అవినీతికి కేంద్రంగా మారిందని విమర్శకులు అంటున్నారు.

ఇక అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో భారీ స్కామ్ జరుగుతోందన్న ఆరోపణలు కూడా వెలువడుతున్నాయి. కీలక పదవుల్లో ఉన్న కొందరు అధికారులు ఫేక్ ఉద్యోగులను చూపించి వారి జీతాలను కూడా తీసుకుంటున్నారనే ఆరోపణలు గతంలో వెలుగులోకి వచ్చాయి. ఒక అధికారి కింద పనిచేస్తున్నట్టుగా నకిలీ ఉద్యోగులను నమోదు చేసి.. వారి పేర్లపై వచ్చే జీతాలను కూడా అదే వర్గాలు తీసుకుంటున్నాయన్న చర్చ జరిగింది.

ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫిల్ట్రేషన్ ప్రారంభించామని చెప్పినప్పటికీ.. ఇప్పటివరకు ఎవరిపై చర్యలు తీసుకున్నారు? ఎవరి పేర్లు బయటపడ్డాయి? అనే ప్రశ్నలకు స్పష్టత లేదని విమర్శలు వస్తున్నాయి. కొద్ది రోజుల పాటు వార్తల్లో నిలిచిన ఈ వ్యవహారం తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోయిందని ప్రతిపక్ష వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఇంకో కీలక అంశం ఏమిటంటే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియమితులైన పలువురు రిటైర్డ్ అధికారులు ఇప్పటికీ కీలక పోస్టుల్లో కొనసాగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. రీ-అపాయింట్‌మెంట్ కాలం ముగిసినా కూడా మరికొంతకాలం పొడిగింపులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

60 ఏళ్లకు రిటైర్ అయిన అధికారులు.. 70 ఏళ్ల వయసులో కూడా కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారని విమర్శకులు అంటున్నారు. ఇదే సమయంలో కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు అవకాశాలు దక్కడం లేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ప్రభుత్వం ఒకవైపు గత ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడుతుండగా.. మరోవైపు అదే కాలంలో నియమితులైన అధికారులను ఎందుకు కొనసాగిస్తోంది అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు.

మొత్తంగా సెక్రటేరియట్‌లో పీఏలు, పీఎస్‌లు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు, రీ-అపాయింట్‌మెంట్లు అన్నీ ఒకే వ్యవస్థలో భాగమై పెద్ద దందాగా మారాయన్న ఆరోపణలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *